Mahanaadu-Logo-PNG-Large

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం

-ప్రతి కౌంటింగ్‌ హాలులో 14 టేబుళ్లు
-1075 మంది ఉద్యోగుల కేటాయింపు
-ముందురోజు నుంచి జిల్లాలో 144 సెక్షన్‌
-జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
-అభ్యర్థులు, ఏజెంట్లకు సూచనలు

గుంటూరు: జిల్లాలో గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికలఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైక్‌ మెన్‌ ఆడిటోరియం బాలమోహన్‌ దాస్‌ హాలులో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటరులో జిల్లా ఎస్పీ తుషార్‌ డూండితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్‌ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 30 మంది అభ్యర్థులు, ఏడు అసెంబ్లీ నియోజ కవర్గాలకు సంబంధించి 132 మంది పోటీలో ఉన్నారని తెలిపారు. ఓట్ల లెక్కింపు యూనివర్సిటీలోని ఐదు విభాగాలలో జరుగుతుందన్నారు. ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ కాలేజీ విభాగంలో తాడికొండ, సివిల్‌ అండ్‌ మెకానికల్‌ విభాగంలో మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు, థర్మల్‌ సైన్స్‌ ల్యాబ్‌ బ్లాక్‌లో పొన్నూరు, ఈసీఈ, ఈఈఈ బ్లాక్‌ లో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల కౌంటింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రతి కౌంటింగ్‌ హాలులో 14 టేబుల్స్‌
ప్రతి కౌంటింగ్‌ హాలులో అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, సంబంధించిన పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుకు సెంట్రల్‌ బ్లాక్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కౌంటింగ్‌ హాళ్లలో ఏజెంట్లు, ఆర్వోలకు టేబుళ్లు, కంప్యూటర్లు, ఫలితాల వివరాలు ఎప్పటికప్పుడు అందించటానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందన్నారు. తొలుత గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవు తుందన్నారు.

1075 మందితో లెక్కింపు
ఈవీఎంలు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుకు 1075 మంది ఉద్యోగులను మొదటి ర్యాండమైజేషన్‌ ద్వారా నియమించటం జరిగిందని, వీరికి మొదటి విడత శిక్షణను ఇచ్చినట్లు చెప్పారు. కౌంటింగ్‌ సిబ్బందికి జూన్‌ 3న రెండవ ర్యాండమైజేషన్‌ చేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించి రెండవ విడత శిక్షణ ఇవ్వటం జరుగు తుందన్నారు. జూన్‌ 4న రిటర్నింగ్‌ అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించిన కౌంటింగ్‌ సిబ్బందికి మూడవ విడత ర్యాండమైజేషన్‌ చేసి టేబుళ్లు కేటాయించటం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ, ఏర్పాట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేసినట్లు వివరించారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు అభ్యర్థులు ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం భద్రత ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రస్తుత మంత్రులు, శాసనసభ్యులు మినహా ఎవరినైనా అభ్యర్థులను కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమిం చకోవచ్చన్నారు.

రేపటి నుంచి 144 సెక్షన్‌
కౌంటింగ్‌కు ముందురోజు నుంచే జిల్లాలో 144 సెక్షన్‌ విధించటం జరుగు తుందని, జూన్‌ 3 సాయంత్రం నుంచే మద్యం అమ్మకాలు నిలిపివేయటం జరుగు తుందని తెలిపారు. బాణసంచా అమ్మకాలు నిలిపివేయటం జరిగిందని, విజయో త్సవ ర్యాలీ నిర్వహించరాదని స్పష్టం చేశారు. పోలింగ్‌ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వటం జరుగుతుందని, కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిర్దేశించిన ప్రాంతా ల్లోనే వాహనాలను నిలిపి సంబంధిత కౌంటింగ్‌ కేంద్రానికి ఏజెంట్లు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పార్కింగ్‌, కౌంటింగ్‌ హాళ్లకు చేరుకునే మార్గాలను తెలియచేస్తూ బోర్డులను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కౌంటింగ్‌ హాళ్లలోకి పోటీలో ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ సిబ్బంది మొబైల్‌ ఫోన్లు అనుమతిం చరని తెలిపారు. వెలుపల మొబైల్‌ ఫోన్లు ఉంచటానికి ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. కౌంటింగ్‌ హాలులోకి పెన్ను, పేపరు మాత్రమే అనుమతించటం జరుగుతుందన్నారు.

2500 మందితో బందోబస్తు
జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి మాట్లాడుతూ ఓట్లు లెక్కింపు నేపథ్యంలో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ప్రీ కౌంటింగ్‌ ఏర్పాట్లలో భాగంగా శనివారం మధ్యాహ్నం నుంచే సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు, మొబైల్‌ పార్టీలు, క్యూఆర్టీ టీంలు కొనసాగుతాయన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి పాస్‌ ఉన్నవారిని మాత్రమే అనుమతించటం జరుగుతుందని, యూనివర్సిటీకి వచ్చే జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డు వద్దే వాహనాలను తనిఖీ చేసి ఒక డ్రైవరుతో పాటు పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించటం జరుగుతుందన్నారు. వాహనాలను నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్‌ చేయాలన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి జిల్లాలో 115 పికెట్‌ పాయింట్లు, 70 మొబైల్‌ పార్టీలు, 56 చెక్‌ పోస్టులు, 28 క్యూఆర్టీ టీంలు, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సు, స్ట్రైకింగ్‌ ఫోర్సు, రిజర్వు ఫోర్సు సిద్ధం చేయటం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలు జరిగిందని, డ్రై డే కూడా ప్రకటించినట్లు తెలిపారు. కౌంటింగ్‌ ప్రశాంత వాతవరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.