కట్టుదిట్టంగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లు

సభా ప్రాంగణం చదును పనులను పూర్తిచేయాలి
ప్రధాని, సీఎంలు, గవర్నర్‌ కాన్వాయ్‌కు దారి కల్పించాలి
పార్కింగ్‌, అప్రోచ్‌ రహదారులను బాగుచేయించండి
ప్రముఖులకు వసతి, పాసులకు చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఆదేశం

మచిలీపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పా ట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం గన్న వరం విమానాశ్రయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో రాష్ట్ర అదనపు డీజీ ఎస్‌.బాగ్చి, ఐజీలు రాజశేఖర్‌బాబు, అశోక్‌కుమార్‌, పోలీస్‌ కమిషనర్‌ రామకృష్ణ, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లు డి.కె.బాలాజీ, ఢల్లీి రావు, జిల్లా పోలీసు అధికారి అద్నా న్‌ నయీం అస్మిలతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు మేధ టవర్స్‌ సమీపంలో స్థలాన్ని ఎంపిక చేశామన్నారు.

సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకోసం ప్రధాన సభ ప్రాంగణాన్ని బాగా చదును చేసి ముళ్లపొదలను తొలగించే పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అక్కడ వేదిక, బారికేడిరగ్‌, బ్లాక్‌ల విభజన, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ప్రముఖులకు వసతి, పాసులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా అందించడంతో పాటు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. సభకు వచ్చే అతిథులకు, ప్రజలకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఆహారం తదితర లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు, ప్రముఖులకు, ప్రజలకు, మీడియా వారికి అవసరమైన సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పార్కింగ్‌, అప్రోచ్‌ రహదారులను బాగుచేయించాలి

ఎంపిక చేసిన లేఅవుట్‌, గంగరాజు, విమానాశ్రయం, వెటర్నరీ కళాశాల, మేధా టవర్స్‌, పెట్రోల్‌ బంకు దగ్గర పార్కింగ్‌ ప్రదేశాల నుంచి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రహదారులను బాగుచేయాలని తెలిపారు. ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాన సభ వేదిక వద్దకు రాకపోకలు, గవర్నర్‌ రాకపోకల కాన్వాయ్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందు లు, అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల సంయుక్త కలెక్టర్లు గీతాంజలి శర్మ, సంపత్‌ కుమార్‌, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడుకర్‌, విజయవాడ డీసీపీ అధిరాజ్‌ ఎస్‌.రానా, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌ ఎం.ఎల్‌.కె.రెడ్డి, గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి పాల్గొన్నారు.