పసుపు, కుంకుమ, చీర పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

• పిఠాపురం శక్తి పీఠంలో పంపిణీకి చీరలు అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 

శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తి పీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందిస్తారు. ఇందుకోసం అవసరమైన చీరలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంపించారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పూజలకు హాజరై పసుపు, కుంకుమ, చీరలు అందుకొనే సోదరీమణులకు గురువారం ఆలయం వద్ద టోకెన్లు అందించారు. మహిళలు బారులు తీరి టోకెన్లు తీసుకున్నారు. మూడు బ్యాచులుగా పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల్లో పాల్గొనేవారికి పసుపు, కుంకుమతో కూడిన చీరను అందిస్తారు. ఈ మూడు బ్యాచుల్లో పాల్గొనలేనివారికి టోకెన్ ప్రకారం అందించాలని హరిప్రసాద్ అధికారులకు సూచించారు. వీటి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగేందుకు భక్తులు సహకరించాలని హరిప్రసాద్ కోరారు.