డ్రోన్ స‌మ్మిట్ కు చ‌క‌చ‌కా ఏర్పాట్లు

– ఏర్పాట్లు ప‌రిశీలించిన డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ దినేష్ కుమార్‌

విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ నెల 22-23 వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయి. రెండు రోజుల స‌ద‌స్సు స‌రిగే మంగ‌ళ‌గిరి సీకే కెన్వెన్ష‌న్ లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజ‌య‌వాడ కృష్ణాన‌ది తీరాన ఉన్న పున్న‌మీ ఘాట్ వ‌ద్ద మెగా డ్రోన్ షో నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. పున్న‌మీ ఘాట్ వ‌ద్ద నిర్వ‌హించే డ్రోన్ షోకు సంబంధించిన ఏర్పాట్ల‌ను జిల్లా అధికారుల‌తో క‌లిసి డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్ శనివారం ప‌రిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జి క‌లెక్ట‌ర్ నిధి మీనా, విజ‌య‌వాడ న‌గ‌ర పోలీసు క‌మీష‌న‌ర్ ఎస్వీ రాజశేఖ‌ర్‌బాబు, విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర త‌దిత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి పున్న‌మీఘాట్‌లో చేప‌డుతున్న ఏర్పాట్ల గురించి చ‌ర్చించారు.