‘ఫైళ్ళ దగ్ధం’ కుట్రదారులను అరెస్టు చేయండి

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్

అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు దగ్ధమవుతున్నాయని, వీటిపై విచారణ పేరిట కాలయాపన చేయకుండా అందుకు కారణమైన కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు.‌ ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని మదనపల్లెలో పెద్ద ఎత్తున ఫైళ్ళు దగ్ధం చేశారని, వేలాది మంది రైతుల భూములను అన్యాక్రాంతం చేశారని, తారుమారు చేశారని, తమపై దౌర్జన్యం చేశారనే ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు.

ధవళేశ్వరం కార్యాలయంలో పోలవరం ముంపు నిర్వాసితులకు సంబంధించిన నష్టపరిహారం దస్త్రాలు కాల్చేశారని, దాదాపు 4,202 కోట్ల పోలవరం ప్రధాన కాలువ నిర్మాణ పనులు, భూసేకరణ కాగితాలు కాలి బూడిద అయ్యాయనే ఆరోపణలు ఉన్నట్టు చెప్పారు. ఇటీవల విజయవాడలో కూడా కొన్ని ప్రభుత్వ కాగితాలను తగుల పెట్టారని ఆరోపించారు. ఫైళ్ళు ఎందుకు దగ్ధం అవుతున్నాయో, దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటో ప్రజలకు చెప్పాలని కోరారు.
సస్సెన్షన్‌, బదిలీలతో సరిపెట్టే ధోరణి వీడి, కేసులు కట్టి అరెస్టు చేయాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని కోరారు.