అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు అమ్మాడు కనుకే అరెస్టు!

– గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

మంగళగిరి, మహానాడు: వైసీపీలో అడుగడుగునా అవినీతిపరులే ఉన్నారని, తప్పు చేసి అడ్డంగా దొరికినా ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం జోగి రమేష్ చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గడిచిన 2 నెలల నుంచి ప్రజాక్షేమమే లక్ష్యంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కూటమి నాయకులు పని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కక్ష్య సాధింపు చర్యలు ఉండవు, తప్పు చేసినట్టు రుజువు అయితే అరెస్టు తప్పదు.

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టానికి అతీతంగా అందరూ ఇబ్బందులుకు గురయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే కూటమి ప్రభుత్వానికి ముఖ్యం. అయితే వైసీపీ ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పూలిమి లబ్ధిపొందాలనుకోవడం సిగ్గుచేటు. ఆధారాలు లేని వాటిని కూడా రాజకీయ ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రయత్నాలు చేయడం శోచనీయం. ఇందులో భాగంగా మంగళవారం మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టు అయ్యారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై మాట్లాడకుండా రాజకీయ కక్ష్యలతోనే అరెస్టు చేశారని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం.

గతంలో సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించేందుకే తన కుమారుడిని అరెస్టు చేశారని ప్రచారం చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం హేయం. ఒక వేళ ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే వారు ఇలా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థతి కూడా ఉండేది కాదు. జోగి రాజీవ్ అగ్రీగోల్డ్ భూములకు సంబంధించిన విషయంలోనే అరెస్టు అయ్యారు.

అగ్రీగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అక్రమాలకు పాలవుతుందని ఫిర్యాదు వచ్చిన కారణంగా ఈ అరెస్టులు జరిగియి తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ కక్షలు లేవు. విజయవాడలోని అంబాపురంలో ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్న భూములను జోగి రమేష్ కుటుంబ సభ్యులు చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేసి విక్రయించారు.

ఈ కారణంగా కొనుగోలు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ఎంతవరకు సబబు అని ఆలోచన చేయాలి. అధికారంలోకి రాగానే అగ్రీగోల్డ్ బాధితులకు సమస్య పరిష్కరిస్తానని చెప్పి జగన్ రెడ్డి గాలికి వదిలేశారు. ఇదే సమస్యపై జగన్ రెడ్డి దృష్టి సారించి ఉంటే ఈ రోజు ఇంత వరకు వచ్చేది కాదు. ఉద్దేశపూర్వకంగానే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించకుండా అగ్రిగోల్డ్ భూములను అక్రమించుకోవాలనే కుట్రను గత ప్రభుత్వం పన్నింది. అనవసరంగా ఈ కేసుకు కులం రంగు, రాజకీయ రంగు పులిమవద్దు అని సూచించారు.

పేదవాడి ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ ప్రథమ లక్ష్యం…

ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. మిగిలిన వాటిని దశలవారీగా ప్రారంభం అవుతాయి. టీడీపీ హయాంలో 4.5 కోట్ల మంది ఆకలిని అన్న క్యాంటీన్లు తీర్చింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కేవలం కక్ష్య పూరిత ఆలోచనలతో గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి పేదవాడి కడుపుకోతకు కారణమైయింది. జగన్ ప్రభుత్వంలో కక్ష్య పూరిత చర్యలు చేపట్టిందని చెప్పటానికి ఇదే నిదర్శనం.

నూజివీడు నియోజకవర్గంలో ఒక రోజు నా సొంత నిధులతో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాను. వివిధ కారణాలతో వేరే చోటుకు వచ్చే వారికి అన్న క్యాంటీన్లు ఉపయోగపడతాయి. అతి తక్కువ ధరకే రుచికర, నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ లను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి అని కోరారు.