సహకార సంఘాల్లో ఎరువుల కృత్రిమ కొరత!

– రైతుల అవస్థలు
– పట్టించుకోని అధికారులు

అవనిగడ్డ, మహానాడు: అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు సహకార సంఘాల్లో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతాంగాన్ని తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఎంతో అవసరమైన ఎరువులను సకాలంలో సక్రమంగా సహకార సంఘాల ద్వారా సరఫరా చేయవలసిన బాధ్యతను కొంతమంది సహకార సంఘాల కార్యదర్శులు విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సహకార సంఘాల నుంచి ఇప్పటికే ఎరువులు లారీల్లో ప్రైవేటు దుకాణదారులకు చేరిపోయినట్టు అనేక విమర్శలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో ఎరువుల కొనుగోలు భారంగా మారుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సహకార సంఘాల కార్యదర్శులు ఎరువుల దుకాణదారులతో చేసుకున్న లోపాయికారి ఒప్పందాల కారణంగా జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారాల నేపథ్యంలో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ అనుకూల సహకార సంఘాల కార్యదర్శులు ఈ విధమైన రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.