కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏం చేశారో అడగండి

ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశా…
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి
ఆలోచించి ఓటు వేయండి..మంచి వారిని ఎన్నుకోండి
కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌

హుస్నాబాద్‌, మహానాడు : ఏనాడూ ఎంపీ పదవిని ఆస్తులు సంపాదించడానికి వాడుకోలేదు.. ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడేందుకే సమయాన్ని వెచ్చించా…ప్రతి నిమిషం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేశారు.. గత ఐదేళ్లలో నేను ఏం చేశానో… కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏం చేశారో ఆలోచించండి. ఇక్కడున్న మంత్రి గత ఐదేళ్లలో ఏం చేశారో బేరీజు వేసుకోండి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ కోరారు. సోమవారం హుస్నాబాద్‌ వచ్చిన ఆయన స్థానిక బార్‌ అసోసియేషన్‌ నాయకులను కలిశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ను శాలువాతో సన్మా నించిన న్యాయవాదులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఎన్నికలైన తరువాత పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గత ఐదేళ్లలో నేను రూ.12 వేల కోట్ల నిధులు తెచ్చానని, ఇందులో జాతీయ రహదారుల నిర్మాణానికే రూ.5 వేల కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. అయినా కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కూటమి పక్షాన ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చలేని దుస్థితిలో ఉందని, ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు.