– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో స్థలం ఉండి ఇంటినిర్మాణం కోసం చూస్తున్న వారి సొంతింటి కల నెరవేర్చడానికి రూ. 4లక్షల వరకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థలం ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఇందుకోసం అర్హులు అవుతారని, ఆ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు. ఆ మేరకు త్వరలోనే అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం, ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థలాలు ఉన్నవారికి తప్పక సాయం అందుతుందని తెలిపారు.
చిలకలూరిపేట పురపాలక వైసీపీ చైర్మన్ షేక్ రఫాని, 8 మంది కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం శుభపరిణాణం అన్న ఆయన ఇంకా నలుగురైదుగురు కౌన్సిలర్లు చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతారని అనుకునే వారిని తప్పక ఆహ్వానిస్తామన్నారు. గురువారం స్థానిక శివప్రియనగర్‌ను ప్రత్తిపాటి సందర్శించారు. ప్లాట్ల యజమానుల సంఘం సభ్యులతో మాట్లాడారు. వెంచర్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చంచారు. అనంతరం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. శివప్రియ నగర్ వెంచర్ వేసి దాదాపు 25 ఏళ్లు అవుతుందని, అప్పుడు డీటీసీపీ పంచాయతీ లేఅవుట్‌గా ఏర్పాటు చేశారన్నారు. సుమారు 40 ఎకరాలు 613 మంది పేద, మధ్య తరగతి వాళ్లు ఈ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందో కూడా సరైనటువంటి హద్దులు గానీ ఈ ప్లాట్ నాదీ అని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో వారి సమస్యల్ని పరిష్కరిస్తామని 650 మంది ఎక్కడెక్కడా ఉన్నవారు నాటి రిజిస్ట్రేషన్ పత్రాలతో వస్తే ప్లాట్లు స్వాధీనం చేయడానికి శివప్రియనగర్ కమిటీ సిద్ధంగా ఉందని, దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు. అక్కడ సరైన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా వంటి వసతులు లేవని.. ముఖ్యమంత్రితో మాట్లాడి అవన్నీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.