Mahanaadu-Logo-PNG-Large

అతనంతే!

అతనంతే…
కలల్లో జీవించేస్తాడు
ఊహల్లో విహరించేస్తాడు
ఊహలకు ఊపిరిపోసి
బతికిస్తా చూడండంటూ
బయలుదేరుతాడు
అన్నట్లే
ఊహలకు ఊపిరిపోసి
ఊరి జనం ముందు నర్తింపజేస్తాడు

అతనంతే…
తలపుల్లో తేలిపోవడమే తప్ప
తల దించనంటాడు
తల వంచనంటాడు
అసలు ఆ మాటలకే అర్థం తేలీదన్నట్లు
ఇప్పుడే కొత్తగా వింటున్నట్లు
కనుబొమ్మలు పైకెగరేస్తాడు

అతనంతే…
అసాధ్యాలపై
అసిధారవ్రతం చేస్తాడు
సాధ్యం
తన కాళ్లకు సాగిలపడేలా చేస్తాడు
ఏం సాధించావని
ఎవరైనా ప్రశ్నిస్తే
ఏం సాధించమంటావో చెప్పమని
పొగరుగా ప్రశ్నిస్తారు…

అతనంతే…
వలవేసి సముద్రాన్ని
తీరానికి లాగేస్తానంటాడు
అందని ఆకాశాన్ని
అరచేత అందిపుచ్చుకుని
నింగికీ ఈడుకొస్తానంటాడు
అనుకున్నదే తడువు
అలుపెరగకుండా
వెనుదిరగకుండా
అలా…అలై సాగిపోతుంటాడు
నిత్య జీవన సమరంలో
మునిగి తేలుతుంటాడు…

అతనంతే…
ఎప్పటి నుంచో చూస్తున్నా
ఎత్తిన ఆ తల దించడానికి
నిటారు మనిషిని
నడి వీధిలో నిలబెట్టడానికి
మరకల మడుగులో ముంచెత్తడానికి
ఎన్నెన్ని ఆయుధాలు విసిరారో
ఎంతమంది ఎంతగా ప్రయత్నించారో
ఒక్కటైనా అవి
అతడి దరిదాపులకు చేరితేనా
కూసింతైనా అతడ్ని కదిలిస్తేనా
కాసింతైనా అతడ్ని కలవరపెడితేనా…

అతనంతే…
చూడటానికేమో
కొండంత మనిషి
ఓ బడుగు గుండె బరువెక్కినా
ఓ పేద పేగు ఆకలి కేకేసినా
ఓ నిర్బాగ్యుడి నిట్టూర్పు వినిపించినా
కన్నీటి చుక్కై కరిగిపోతాడు
అండగా తానే నీడగా మారి
గరీబుల గొడుగై కప్పేసుకుంటాడు
ఆ దారికి ఎవరడ్డొచ్చినా సరే
దేవుళ్లూ…దయ్యాలూ…దండెత్తినా
చలించడు సరికదా..
ఉప్పెనై విరుచుకుపడతాడు
ఊరవతల దాకా
తరిమి తరిమి కొడతాడు..

అతనంతే…
నిజాన్ని…నిర్భీతిని
నిలువెత్తు బొట్టుగా దిద్దుకున్నోడు
వేనవేల గుండెల్లో
దీపమై వెలుగుతూ
వేనవేల జీవితాలను
వెలిగిస్తున్నోడు
జన తీర్థానికి
నిలువెత్తు సంతకమైనోడు
ఆరడుగులైనా లేని
అతని సామాన్యుడు

అతను
ఏమైనా చేయగలడు
ఏదైనా సాధించగలడు

అతనంతే….

(నాకు, నాలాంటి ఎంతోమంది
అనామకులు అక్షరాలను ఆయుధంగా
చేసుకోవడం ఎలాగో నేర్పి ఎంతోమంది
మెరికలను తీర్చిదిద్దిన అక్షర కృషీవలుడు…
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్‌
శ్రీ రామోజీరావు గారికి…)

` ఎ.కిశోర్‌బాబు
8754995544