ఆత్మీయత అడుగంటి పోయింది నేడు

పుష్కల మైన అనుబంధాలు ఎక్కడా?
పుష్కరానికి ఒకసారి ఇండ్లకు వస్తే
అనుబంధాలన్ని అటకెక్కి పోతుంటే
ఆత్మీయత అడుగంటిపోతుంది నేడు..

గుండె నిండా సంబరాలు దూరమై
ఇంటికొచ్చే పలకరింపు కష్టమయ్యే
ఆరు బయట కబుర్లు వినిపించవు
వెన్నెల్లో మంచాలు కనిపించవు..

ఇంటికొచ్చిన చుట్టాలతో సందళ్ళు
వాళ్లు వెళ్లి పోతుంటే విషాదం
ఉన్నన్నాళ్లు మనసు నిండా సంతోషం
నిండైన మాటలతో మనసంతా ఆనందం..

ఇంటినిండా చిరుతిండ్ల వినోదం
పంచుకొని తిని నిత్య పరమాన్నం
పదిమంది కలిసి తింటే ఆరోగ్యం
మనసునిండా ఆప్యాయత తరంగం..

సంతోషం ఇంకెక్కడా కనిపిస్తుంది
డబ్బుతో సంబంధాలు కుదురుతుంటే
కబుర్లు చెప్పే కాలం వెళ్లిపోయే
మనిషిలో అనుబంధాలు తెగిపోయే…

హృదయంలో భారం పెరుగుతూ
కన్నీళ్లే సాగరంగా మారుతుంటే
రుచిలో ఉప్పులా కలిసిపోక
మనసులో నిప్పులు ఉంచుకుంటున్నారు..

అలనాటి ప్రేమలో ఆయుష్షును పెంచితే
బాంధవ్యాలు నేడు క్షీణిస్తుంటే
పేచీలతో రోజు రోజు బంధం దూరమవుతుంటే
కక్షలతోనే మనుషులు ప్రవర్తిస్తున్నారు..

రక్త సంబంధం దారపు పోగులుగా తెగుతూ
ఒకే ఇంట్లో రెండు కుండలు ఉడుకుతుంటే
ఆప్యాయాల పాయసం విషంగా తోస్తూ
ఇంట్లోనే వివక్షా లు తాండవం చేస్తున్నాయి..

మనుషుల మధ్య దూరం పెరిగే
విలువలన్నీ మటుమాయం అయ్యే
బతుకులన్నీ భారమై ఏడుస్తుంటే
మానవత్వపు బాంధవ్యం ఎక్కడ కనిపిస్తుంది..

ఇకనైనా ఆరోజుల కోసం ఎదురుచూద్దాం
అనురాగ బంధాలకు నీళ్లు పోద్దాం
కుటుంబ మొక్కను మహా వృక్షం చేద్దాం
ఆ నీడలో సంతోషంగా గడుపుదాం..

– కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235