మీడియా సంస్థలపై దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమే

– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో పాత్రికేయులపై , మీడియా సంస్థలపై జరుగుతున్న తీవ్రతరమైన వరుసదాడుల పట్ల సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ తీవ్ర ఆందోళనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పాత్రికేయులపై , సంస్థలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. ఆమేరకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ చైర్మన్ , హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షులు , రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పూర్వ ఎన్నికల ప్రధానాధికారి, డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పాత్రికేయులపై ఉద్దేశపూర్వక దాడులు , మీడియా సంస్థల కార్యాలయాల విధ్వంసం వంటి చర్యలు , మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముమ్మాటికీ విరుద్ధమేనన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలోనాలుగో స్థంభంగా కొనియాడ బడుతున్న మీడియా ,ప్రజలకు వాస్తవాలను నిజాయితీగా నివేదించే కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నదని , మీడియా స్వేచ్ఛను అణచివేయడానికి జరిగే ప్రయత్నాలు గర్హనీయమని వారా ప్రకటనలో పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డ దుండగులు ఏ రాజకీయ పార్టీలకు చెందినవారైనా వెంటనే అరెస్టు చేయాలని, చేసిన దురాగతాలకు తగిన మూల్యం వారు చెల్లించేటట్లు గట్టి చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని వారా ప్రకటనలో కోరారు. మీడియా స్వేచ్ఛకు అండగా పౌరసమాజం నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.