ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు గురించి మంత్రి నారా లోకేశ్   మాట్లాడుతూ…. స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడితో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం త‌న‌కు రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని లోకేశ్ అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు అని అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని తెలిపారు. వైసీపీ హ‌యాంలో కక్ష‌గ‌ట్టి అయ్య‌న్న ఇంటిని కూల‌గొట్టినా, కేసులు పెట్టినా త‌గ్గ‌కుండా పోరాడార‌ని కొనియాడారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయ‌న‌కు చాలా అనుభవం ఉంద‌న్నారు.

25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యార‌ని, 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉంద‌న్నారు. ఇక గతంలో సభ ఎంతో హుందాగా జరిగేద‌ని, గత ఐదేళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవరించిందంటూ దుయ్య‌బ‌ట్టారు. సభ సంప్రదాయాలను గౌరవించేలా.. సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని లోకేశ్‌ స్పీకర్‌ను కోరారు.

అయ్య‌న్న‌ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడి నుంచి నేర్చుకోవల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. త‌న‌కు ఎప్పుడు సలహా కావాలన్నా ఆయ‌న‌ను సంప్రదించాన‌ని లోకేశ్ తెలిపారు. ఒకే పార్టీ, ప్ర‌‌జ‌లే అజెండా‌గా అయ్య‌న్న ముందుకెళ్లార‌న్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో స‌భ‌ను గౌర‌వ‌ప్ర‌దంగా ముందుకు తీసుకెళ్తామ‌న్నారు. స్వ‌ప‌క్ష‌మే ప్ర‌తిప‌క్షంలా మారి ప్ర‌‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో చ‌ర్చిస్తామ‌న్నారు.