‘ఆయుష్’ కు పెరిగిన ఆయుష్షు!

– అండగా ఉంటామని కేంద్రం హామీ
– గ‌త ఐదేళ్ళలో రాష్ట్రానికి ద‌క్కిన సాయం కేవ‌లం రూ.38 కోట్లు
– ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.91 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం
– ఫ‌లించిన ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కృషి
– నూత‌న ప్ర‌భుత్వ క‌ళాశాల‌పై జ‌గ‌న్ నిర్ల‌క్ష్యంపై మంత్రి మండిపాటు
– ఆ వైద్య క‌ళాశాల‌ల‌న్నీ పూర్తి చేస్తాం

విజ‌య‌వాడ, మహానాడు: ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి (2024-25) రాష్ట్రంలో ఆయుష్ సేవ‌ల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం మున్నెన్న‌డూ లేనివిధంగా రూ.90 కోట్ల 84 ల‌క్ష‌లు నిధులు అందించ‌డానికి స‌మ్మ‌తించింది. ఈ మేర‌కు రాష్ట్ర ఆయుష్ విభాగానికి స‌మాచారం అందిన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ శుక్ర‌వారం వెల్ల‌డించారు. స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసిన పాత్రికేయుల‌తో మాట్లాడుతూ…. 2019-24 కాలంలో ఆయుష్ విభాగానికి కేవ‌లం రూ.38 కోట్లు మాత్ర‌మే కేంద్ర నిధులు ల‌భించ‌గా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌మ విజ్ఞ‌ప్తి మేర‌కు కేంద్ర సాయాన్ని భారీగా పెంచ‌డానికి మోదీ ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. ఈ సంవ‌త్సం జూలై లో కేంద్ర ఆయుష్ శాఖా మంత్రి, ఉన్న‌తాధికారుల్ని క‌లిసి గ‌త ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆయుష్ కార్య‌క్ర‌మాలు నిర్ల‌క్ష్యానికి గురైన తీరును వివ‌రించి, వాటి అభివృద్ధికి త‌గు మేర‌కు కేంద్ర నిధుల్ని అందించాల‌ని కోరిన‌ట్టు మంత్రి తెలిపారు. త‌మ విజ్ఞ‌ప్తిని అంగీక‌రించినందుకు ఆయ‌న కేంద్రానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

రాష్ట్రంలో ఆయుష్ శాఖ‌ను బ‌లోపేతం చేసేందుకు, ఆయుష్ వైద్య శాల‌ల్లో మందుల స‌ర‌ఫ‌రాకు, నిర్మాణ ద‌శ‌లో ఆగిపోయిన 50 ప‌డ‌క‌ల ఆయుష్ ఆసుప‌త్రుల్ని పూర్తి చేసేందుకు, పాడుబ‌డిన ఆయుష్ డిస్పెన్స‌రీల పున‌ర్నిర్మాణానికి, వివిధ ఆయుష్ పథకాల‌కు, రాష్ట్రంలో ఉన్న ప్ర‌భుత్వ ఆయుష్ క‌ళాశాల‌లు, ఆసుప‌త్రుల‌ను మెరుగుప‌ర్చేందుకు, నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌కృతి వైద్య క‌ళాశాల నిర్మాణానికి, రాష్ట్రంలోని 126 ఆయ‌ష్మాన్ ఆరోగ్య మందిరాల‌ను ప‌టిష్ఠం చేసేందుకు కేంద్ర సాయాన్ని కోరిన‌ట్టు మంత్రి వివ‌రించారు.

రాష్ట్రంలోని 90 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్ని ఎన్ ఎబిహెచ్ గుర్తింపు కోసం పంప‌గా, 89 కేంద్రాల‌కు మంజూరు ల‌భించిన‌ట్టు మంత్రి తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వ ఆయుష్ క‌ళాశాల‌లు ఎక్కువ సంఖ్య‌లో ఉండ‌గా, రాష్ట్రంలో కేవ‌లం ఒక్క ప్ర‌భుత్వ ఆయుర్వేద క‌ళాశాల ఉన్నందున మ‌రో క‌ళాశాల నిర్మాణానికి కేంద్ర సాయాన్ని కోరగా, సానుకూల స్పంద‌న ల‌భించిన‌ట్టు మంత్రి తెలిపారు.

ఈ మేర‌కు ధ‌ర్మ‌వ‌రంలో నూతన ఆయుర్వేద క‌ళాశాల‌ను, దాని అనుబంధ 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని నిర్మించే ఆలోచ‌న చేసిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రానికి ఆయుర్వేద క‌ళాశాల‌ల్లో ఈ విద్యా సంవ‌త్స‌రానికి అద‌నంగా యూజీ, పిజి సీట్ల కేటాయింపు కోర‌గా కేంద్రం సానుకూలంగా స్పందించిన‌ట్టు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు.

కేంద్రం హామీ మేర‌కు విశాఖ‌ప‌ట్నంలో 50 ప‌డ‌క‌ల ఆయుష్ ఆసుప‌త్రికి రూ.8.50 కోట్లు, కాకినాడ‌లోని ఆసుప‌త్రికి రూ.8 కోట్లు, ఆరోగ్య మందిరాల‌కు రూ.5.75 కోట్లు, ఆయుష్ క‌ళాశాల‌ల‌కు రూ. 20 కోట్లు కేంద్ర నిధులు ల‌భించ‌నున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. సిబ్బంది శిక్ష‌ణ కోసం అద‌నంగా మ‌రో 10 కోట్లు కావాల‌ని కేంద్రాన్ని కోరామ‌న్నారు.

మాజీ సీఎం జ‌గ‌న్ నిర్వాకంపై మంత్రి మండిపాటు

ఐదేళ్ళ పాల‌న‌లో 17 ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌ను నిర్మిస్తామ‌ని నానా ఆర్భాటం చేసిన మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వాస్తవంగా వాటి పట్ల పూర్తి నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మండిపడ్డారు. త‌మ పాల‌నా కాలంలో సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందుల‌లో నెల‌కొల్పాల్సిన వైద్య క‌ళాశాల ప‌ట్ల కూడా చిత్త‌శుద్ధితో ప‌నిచేయ‌కుండా రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి అధికారంలోకొచ్చిన నెల రోజుల్లోపే జ‌గ‌న్ రెడ్డి అస‌త్య ఆరోప‌ణ‌ల‌కు దిగ‌జారార‌ని ఆయ‌న దుమ్మెత్తిపోశారు. రూ.8500 కోట్ల‌తో 17 క‌ళాశాల‌ల‌ను నిర్మిస్తామ‌ని చెప్పి అధికారంలో నుండి దిగిపోయేనాటికి కేవ‌లం రూ.2125 కోట్ల మేర‌కే (25 శాతం)ప‌నులు పూర్తి చేసిన‌ట్టు చూపి అందులోనూ కేవ‌లం రూ. 1451 కోట్ల మేర‌కే(16 శాతం) చెల్లింపులు చేసిన మాజీ ముఖ్య‌మంత్రికి నేడు కూట‌మి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌ని స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ రెడ్డి అధికారం నుండి వైదొల‌గే నాటికి పులివెందుల వైద్య క‌ళాశాల నిర్మాణానికి సంబంధించి 48 శాతం బోధ‌నా సిబ్బంది లోటుతో పాటు 37 శాతం మేర‌కు ఇత‌ర అనుబంధ బోధ‌నా సిబ్బంది లోటు ఉంద‌ని జాతీయ వైద్య సిబ్బంది ఎత్తిచూపింద‌ని… ఈ లోటుల‌ను త‌మ‌కు ల‌భించిన నెల రోజుల్లో కూట‌మి ప్ర‌భుత్వం ఎలా పూర్తి చేయ‌గ‌లుగుతుంద‌ని మంత్రి నిలదీశారు. రెండో ద‌శ‌లో నిర్మించాల్సిన మ‌రో నాలుగు కాలేజీల్లో ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉండ‌డంతో ఈ విద్యాసంవ‌త్స‌రానికి వాటిల్లో ప్ర‌వేశాలు చేప‌ట్ట‌డం కుద‌ర‌లేద‌ని… ఈ దుస్థితికి కేవ‌లం జ‌గ‌న్ రెడ్డే బాధ్యుడ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ద‌శ‌ల్లో నిర్మాణంలో ఉన్న 17 ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌న్నింటినీ త‌గు విధంగా పూర్తి చేసి విద్యార్థుల ప్ర‌వేశాలు చేసి తీరుతామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. మొదటి ద‌శ‌లో చేప‌ట్టిన 5 క‌ళాశాల‌లు ఇప్ప‌టికే ముందుకు సాగుతున్నాయ‌ని, మిగిలిన వాటిని ముందుకు తీసుకుపోవ‌డానికి త‌గు మార్గాలు ప‌రిశీలిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. పిపిపి మోడ‌ల్, వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్ అవ‌కాశాల‌ను మ‌దింపు చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఈ క‌ళాశాల‌ల‌ను మూసి వేయ‌డానికి కుట్ర జ‌రుగుతోంద‌న్న దుష్ప్ర‌చారాన్ని మంత్రి ఖండించారు.