Mahanaadu-Logo-PNG-Large

బాబు..బాగా బిజీ!

– మోదీ, అమిత్‌షా, నిర్మల, పీయూష్, రాజ్‌నాధ్‌సింగ్, నద్దాతో భేటీ
– రాష్ట్రానికి నిధులు రాబట్టడమే ఏకైక అజెండా
– ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన

( అన్వేష్)

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండురోజుల బాబు పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్,రాజ్‌నాధ్‌సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, 16వ ఆర్ధిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా, భారత్‌లో జపాన్ రాయబారి, ఫిక్కీ చైర్మన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, అదనపు సాయం, విభజన అంశాలపై చర్చించారు. వారికి తన పార్టీ ఎంపీలను పరిచయం చేశారు. పూర్తిగా రాష్ట్రాభివృద్ధి, నిధులు రాబట్టడమే ఏకైక అజెండాగా సాగిన బాబు పర్యటన ఢిల్లీ వర్గాలను ఆకర్షించింది.

ప్రధాని మోదీతో బాబు కీలకమైన రాష్ట్ర ప్రాజెక్టుల గురించి చర్చించారు. పోలవరం పనుల పునరుద్ధరణ, అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఆర్ధిక సాయం, ప్రత్యేక పథకం కింద రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు నిధుల సాయం, పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు, దుగరాజపట్నం పూర్తికి సహకారం, బుందేల్‌ఖండ్ ప్యాకేజీ మాదిరిగానే ఏపీలోనూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం అందించాలని మోదీని కోరారు.

ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయం.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లకే సరిపోవడం లేదని, జగన్ సర్కారు ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చినందున.. ఏపీ తిరిగి కోలుకునే వరకూ సాయం అందించాలని అభ్యర్ధించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఇప్పటివరకూ విభజన హామీలు అలాగే నిలిచిపోయాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆమేరకు తాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో శనివారం భేటీ అవుతున్నట్లు ప్రధానికి వివరించారు.

ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌తో జరిగిన భేటీలో, రాష్ట్రానికి అదనపు సాయంపైనే దాదాపు గంటసేపు చర్చించారు. అమరావతి సహా వెనుకబడిన ప్రాంతాలను పూర్తిగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను త్వరగా పూర్తి చేయాలని, గతంలో తాము సూచించిన ప్రాజెక్టులను చేపట్టాలని మంత్రి గడ్కరీని కోరారు.

కాగా బాబు పర్యటన నేపథ్యంలో.. రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేస్తారన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో వ్యక్తమయింది. అదనపు నిధుల కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై త్వరలోనే స్పష్టత రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రానికి ఐపిఎస్ అధికారుల సంఖ్యను పెంచవచ్చని, కుప్పం-హోసూరు-బెంగళూరు మధ్య 4 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, సమీకృత ఆక్వా పార్కు,తోపాటు.. మూడు శాఖల నుంచి రావలసిన సుమారు 450 కోట్ల పెండింగ్ నిధులు కూడా, త్వరగా మంజూరయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖలకు సంబంధించి 125 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు, పెద్దగా అవరోధాలు ఉండకపోవచ్చని ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు.

‘‘ ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి అయిన మనకు మోదీ-అమిత్‌షాతోపాటు కేంద్రమంత్రులు బాగా ప్రాధాన్యం ఇచ్చారు. బాబుగారి డిమాండ్లను ఆసక్తిగా విన్న మంత్రుల బృందం వాటిని నోట్ చేసుకుంది. కొన్ని వినతులపై వెంటనే చర్చలు తీసుకోవాలని మంత్రులు నోట్‌లో రాశారు. బాబు గారి టూర్ తర్వాత కేంద్ర శాఖల నుంచి కార్యాచరణ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామ’’ని ఓ ఎంపి వ్యాఖ్యానించారు.