టీటీడీ లడ్డూ ఆరోపణలపై బాబు వ్యాఖ్యలు దారుణం

– సీబీఐ లేదా న్యాయవిచారణ చేయాలి
– ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి అలా మాట్లాడడం తగదు
– మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌

విశాఖపట్నం: ఎన్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు, టీటీడీ లడ్డూను ప్రస్తావించడం, ఆ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించడంపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడ్డం దురదృష్టకరమన్న ఆయన, సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు.. ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయడం çసరి కాదని స్పష్టం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, నైవేద్యంలో నాణ్యత లేని పదార్ధాలు వాడారన్న సీఎం ఆరోపణలు మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ తీవ్ర దుమారాన్ని రేపాయని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఇలా ఆరోపణ చేసే బదులు, వాటిపై విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చి.. అప్పుడు మాట్లాడితే బాగుండేదని తేల్చి చెప్పారు. అందుకే ఆ ఆరోపణలపై సీబీఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

చట్టాల్లో లొసుగులు ఆసరాగా చేసుకుని చట్టానికి అతీతంగా ప్రవర్తించినట్లు.. దేవుడితో అలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా ఫలితం అనుభవిస్తారని బొత్స హెచ్చరించారు. ఏ మతం, ఏ కులమైనా ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి ఉంటుందని, తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష తప్పదన్న ఆయన, ఇప్పటికైనా పత్రికలు, పార్టీలు ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.

ప్రసాదాలకు వాడే పదార్ధాల నాణ్యతను పరీక్షించిన తర్వాత, అవి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే అనుమతించడం లేకపోతే తిరస్కరించడం టీటీడీ ఆనవాయితీ అని మండలి విపక్షనేత గుర్తు చేశారు.
అలా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 18 ట్యాంకర్లు, అంతకు ముందు చంద్రబాబు హయంలో 14 ట్యాంకర్లను వెనక్కు పంపారని తెలిపారు. సందర్భం లేకుండా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇంత వివాదం చేస్తూ.. ప్రజల మనోభావాలను ఎందుకు గాయపరుస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

తమ 100 రోజుల పాలనలో ఏం చేశామో చెప్పడం లేదా రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడకుండా, గత తమ ప్రభుత్వంపై బురద చల్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమలు సంగతి అటుంటి.. కనీసం గతంలో అమలైన అమ్మఒడి, రైతుభరోసా లాంటి ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌ అయినా ఇవ్వాలి కదా అని నిలదీశారు. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్న బొత్స, హామీల డైవర్షన్‌ కోసం ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం సరి కాదన్నారు.

విజయవాడ వరదల్లో ప్రభుత్వ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయిన వారు, ఆకలితో తిండి లేక అలమటించిన వారెంత మందో లెక్కలు చెప్పాలని అడిగితే.. బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర చేశారంటూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం శోచనీయమని మండలి విపక్షనేత అన్నారు. ఆ బోట్లు వరదలో ఎలా కొట్టుకొచ్చాయో మీ మనస్సాక్షికి తెలియదా? అని ప్రభుత్వాన్ని నిలదీసిన బొత్స.. కొండపై కొలువున్న కనకదుర్గమ్మకు అన్ని వాస్తవాలు తెలుసన్నారు.

35 ఏళ్ల రాజకీయ జీవితంలో వరదల్లో ప్రజలు చనిపోయిన సందర్బాలు చూశాను కానీ.. ఇలా ప్రభుత్వ అసమర్ధత వల్ల మూడు రోజుల పాటు నీటిలో ఉండిపోయి తాగు నీళ్లు, తిండి లేక ఇంత మంది చనిపోయిన పరిస్ధితులెక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ రాష్ట్రం నడిబొడ్డున జరగడం మరింత శోచనీయమని తేల్చి చెప్పారు.

టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశం లేదన్న మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మాటలతో ఏకీభవిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని.. కల్తీ జరిగినట్లు విచారణలో తేలితే నిందితులను శిక్షించాలన్నారు. లేని పక్షంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మండలి విపక్షనేత డిమాండ్‌ చేశారు.