బహుళ అంతస్తు నిర్మాణాల్లో నిబంధనలు పాటించండి

– కమిషనర్‌ శ్రీనివాసులు

గుంటూరు, మహానాడు: నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు సెట్ బ్యాక్ పోర్షన్ లో జనరేటర్లు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ ఐపిడి కాలనీ, బుడంపాడు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. ప్రధానంగా సెట్ బ్యాక్ పోర్షన్ లో ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని, జనరేటర్లు కూడా పెట్టడానికి వీలు లేదన్నారు. ర్యాంప్ లు రోడ్ మీద వరకు రాకూడదని, గ్రీనరీకి కేటాయించిన విధంగా ఉండాలన్నారు. వాచ్ మెన్ రూమ్ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ పరిశీలినకు ముందే పట్టణ ప్రణాళిక అధికారులు ఆయా భవనాలనుబ్ పరిశీలించాలన్నారు. సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిర్మాణ పనులు జరిగే సమయంలోనే అనుమతించిన ప్లాన్ మేరకు జరుగుతున్నదీ లేనిదీ పరిశేలిస్తూ ఉండాలని ఆదేశించారు.

పర్యటనలో సీటీ ప్లానర్ డి.రాంబాబు, డిప్యూటీ సిటి ప్లానర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సిటి ప్లానర్ అజయ్ కుమార్, టిపిఎస్ లు సువర్ణ కుమార్, రసూల్, ఎంహెచ్ఓ రామారావు, డీఈఈ శ్రీధర్, ఏఈ సునీల్ కుమార్, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.