– బహుజన బాలకోటయ్య వ్యాఖ్య
హైదరాబాద్, మహానాడు: తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కు లేదని, అందువల్లనే చిత్ర పరిశ్రమలోని నటులను రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డున పడేస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వర్సెస్ నాగార్జున ఎపిసోడ్ నేపథ్యంలో నాలుగు గోడల మధ్య జరిగే కుటుంబ వ్యవహారాలను బజారు కీడ్చే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. అయితే అందరి విషయంలో స్పందించాల్సిన చిత్ర సీమలోని అగ్ర తారాగణం కొందరి విషయంలో స్పందించటం దురదృష్టం అన్నారు. దివంగత ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి దేవి, పవన్ కల్యాణ్ భార్య రేణుదేశాయ్, ముంబై నటి కాదంబరి జత్వానీ ఇలాంటి సంఘటనలను మరిచి పోయారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సినీ పెద్దలు ఎన్ని సినిమాలు తీశాం, ఎంత వచ్చింది అనే డబ్బు సంచుల లెక్కలతో పాటు తమ కుటుంబానికి చెందిన వారికి భద్రత కల్పించుకోవాల్సిన అవసరం ఉందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.