బందరులో కలవరం

మగబిడ్డ అపహరణ
గంటల్లోనే దొంగ పట్టివేత
నర్సు వేషంలో ప్లాన్
ఆధునిక టెక్నాలజీతో .. పోలీసులు పట్టివేత
సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం

(బహదూర్)

మచిలీపట్నం ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ వేషంలో ఓ మహిళ మగ శిశువును అపహరించిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి మూడు రోజుల కిందట మగ శిశువుకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1:30 గంటలకు తమ్మిశెట్టి లక్ష్మి అనే మహిళ కాన్పుల వార్డులోకి నర్సింగ్ వేషంతో వచ్చి స్వరూప రాణి తో మాటలు కలిపి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.

మహిళ మాటలను నమ్మబలికిన స్వరూప రాణి తనతో స్నేహపూర్వకంగా మాట్లాడింది. అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న స్వరూప రాణిని గమనించిన మహిళ శిశువును అపహరించింది. శిశువును అపహరించడానికి తనకు సహాయంగా ఓ మైనర్ బాలుడును తీసుకు వచ్చింది.

మచిలీపట్నం గైనిక్ వార్డులో బాలింత మహిళలను చూడటానికి వచ్చే ప్రజల రాకపోకలను రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయకపోవడం.. తన రాకపోకలను గమనించని సెక్యూరిటీ సిబ్బంది నిద్రలో ఉండటం, గైనిక్ వార్డులో గుర్తు తెలియని వ్యక్తుల రాక పోకలు పట్టించుకోని నర్సులు ఉండటం శిశువును అపహరించిన మహిళకు కలిసి వచ్చింది.

తల్లి కలవరం

ని ద్రపోతున్న తల్లి తన శిశువు అలికిడి లేకపోవడంతో నిద్రలేచి చూసింది. మంచం మీద తన మగ శిశువు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ విలపించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అంతమంది కళ్ళు కప్పి శిశువును అపహరించడం స్థానికంగా కలకలం రేపింది. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిసి కెమెరాలు రికార్డు అయింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువులకు రక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్వరూప రాణి కుటుంబ సభ్యులు ఆసుపత్రి అంత గాలించారు. శిశువు ఎక్కడ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించలని భావించి మచిలీపట్నం పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు.

టెక్నాలజీతో పట్టివేత

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు అపహరణ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మచిలీపట్నం సీఐ సోమేశ్వరరావు విచారణ చేపట్టారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా పోలీసులు పూర్తి టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ ఆసుపత్రిలో ని సీసీ కెమెరా, టెలిఫోన్ లొకేషన్ సహాయంతో గంటల వ్యవధిలో కేసును చేదించారు. మగ శిశువును అపహరించిన మహిళను ఇంగ్లీష్ పాలెం లో గుర్తించి శిశువును క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మహిళ వెనక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అపహరించబడిన శిశువును పోలీసులు తమకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా పోలీసుల పనితీరుకు కితాబ్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు. శిశువును అపహరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకునీ విచారిస్తున్నారు.

సిబ్బంది పని తీరుపై జనం ఆగ్రహం

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని సెక్యూరిటీ సిబ్బంది పనితీరును ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆసుపత్రికి 24 గంటలు రక్షణ కవచంగా ఉండాల్సిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు అపహరించారని, ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ విజయవాడకు చెందిన కార్తికేయ ఏజెన్సీలకు అప్పగించారు.

కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఏజెన్సీ ని రద్దు చేయాలని అదే స్థానంలో పటిష్టమైన భద్రత జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఏర్పాటు చేయాలని, అలాగే గైనిక్ వార్డులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నర్సింగ్ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అపహరించిన తమ్మిశెట్టి లక్ష్మి వెనక ఉన్న రాకెట్ ను ఛేదించాలని ప్రజలు కోరుకుంటున్నారు.