* బీసీలు ఐక్యంగా ఉంటేనే వైసీపీ భూతాన్ని ఎదుర్కోగలం
* 300 మందిని పొట్టన పెట్టుకున్నారు
* 26వేల మందిపై అక్రమ కేసులు బనాయించారు
* ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం
* నిధులూ… విధులూ లేని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు
* బీసీలను శాసించే స్థాయికి తీసుకెళ్తాం
* జయహో బీసీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
‘భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు వెన్నెముక బీసీ కులాలే. బీసీ కులాలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము. జనాభాలో అత్యధిక శాతం ఉండి కూడా బీసీల ప్రాణ రక్షణకు చట్టాలు చేసుకునే పరిస్థితి దాపురించింది అంటే దానికి కారణం బీసీల్లోని అనైక్యత. బీసీలు ఐక్యతతో ఉంటే ఏ వైసీపీ భూతానికీ భయపడాల్సిన అవసరం లేదు. ఐక్యంగా ఉంటేనే ఆ భూతాన్ని ఎదుర్కోగలం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సంఖ్యా బలం ఉండే బీసీ కులాలే కాదు… అల్పసంఖ్యాక బీసీ కులాలు కూడా అభివృద్ధి చెందాలని, శాసించే స్థాయికి బీసీలు ఎదగాలని ఆకాంక్షిస్తున్నామని స్పష్టం చేశారు. బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ కోసం బీసీ డిక్లరేషన్‌ను జనసేన- తెలుగుదేశం కూటమి విడుదల చేసింది. ఇందు కోసం మంగళగిరిలో ‘జయహో బీసీ’ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు , జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బీసీల పొట్టకొట్టారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. దాదాపు 30 మంది కార్మికుల బలవన్మరణాలకు కారకుడయ్యారు. అందరికీ చెందాల్సిన ఇసుక, క్వారీలను ఒక కంపెనీకి కట్టబెట్టి కోట్లు కొల్లగొట్టారు.
వైసీపీ బీసీ గర్జన హామీలు ఏమయ్యాయి?
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏలూరులో బీసీ గర్జన పేరుతో సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీల సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 15 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ. 75వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు… దాన్ని నెరవేర్చలేకపోయారు. బీసీలకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఆర్భాటంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అవి వైసీపీ నాయకుల రాజకీయ పునరావాసానికే పరిమితమయ్యాయి తప్ప… లక్ష్యసాధనలో ఒక్క అడుగు కూడా వేయలేకపోయాయి. నిధులు, విధులు లేవు. వైఎస్ఆర్ చేయూత పథకంలో అనేక కారణాలు చూపించి అర్హులను తొలగిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాని ఊసే లేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో దాదాపు 26వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారు. 300 మందిని హత్య చేశారు. అచ్చెన్నాయుడు గారి లాంటి నాయకులను జైలుకు పంపించారు. గుంటూరు జిల్లాలో తన అక్కను ఏడిపిస్తుంటే అడ్డుకున్నాడని అమరనాథ్ గౌడ్ అనే పదో తరగతి చదివే బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇవన్ని చూస్తుంటే ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమనే భావన కలుగుతోంది.
బీసీలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా చేస్తాం
రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన వాడిగా చెబుతున్నాను.. బీసీలకు సమగ్రాభివృద్ధి, సాధికారిత అవసరం. దేవాలయాల ఆచార వ్యవహారాల్లోనూ కుల వృత్తులు చేసే వారిని అనుసంధానం చేస్తాం. వడ్డెర కులస్తులకు క్వారీల్లో హక్కులు కల్పిస్తాం. క్వారీల బ్లాస్టింగుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం. ప్రతి 30 కిలోమీటర్లకు జెట్టీలు నిర్మించి మత్స్యకారుల వలసలు నిరోధిస్తాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు నిర్మిస్తాం. మత్స్యకారులను ఆర్థికంగా దెబ్బకొట్టాలని వైసీపీ తీసుకొచ్చిన జీవో నెం.217ను చించేశాం. బీసీ యువత కుల వృత్తులపై ఆధారపడి బతికే పరిస్థితి లేనందున వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
బీసీలకు 16,800 పదవులు దూరం చేశారు
వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. దీంతో 16,800 మంది బీసీలను పదవులకు దూరం చేశారు. జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ను మళ్లీ పునరుద్ధరిస్తాం. బీసీల్లో ఉన్న 153 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. రాజకీయాల్లో బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 80ల్లోనే అనేక బీసీ కులాలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు . బీసీ డిక్లరేషన్ కు జనసేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. బీసీలు సాధికారిత, రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
బీసీ నాయకత్వంపై గొడ్డలి వేటు వేసిన వైసీపీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తిని మార్చే శక్తి జగన్ కు లేదు.. మాచర్లలో 18 మంది బీసీలను చంపిన వ్యక్తిని ఏం చేయలేకపోయాడు. చంద్రయ్య, వెంకట సుబ్బయ్య వంటి బీసీ తెలుగుదేశం కార్యకర్తలను చంపిన వారిని పట్టుకునే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదు. తిరుపతిలో ఎర్రచందనం వ్యాపారం చేసే వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చి టిక్కెట్ ఇస్తున్నారు. ఇదీ జగన్ అసలు రూపం. నలుగురు రెడ్లతో రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్ కు.. సామాజిక న్యాయం అనే పలికే అర్హత కూడా లేదు. జగన్ సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో మంగళవారం జనసేన – తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా ‘‘జయహో బీసీ’’ పేరుతో బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశాయి.
ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘బీసీ నాయకులపై వైసీపీ పాలనలో ఇష్టానుసారం కేసులు పెట్టారు. ఇది దుర్మార్గ ప్రభుత్వం. 45 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ప్రభుత్వం. బీసీ నాయకత్వంపై గొడ్డలి వేటు వేసిన పార్టీ వైసీపీ. బీసీలు పైకి రాకూడదనేలా పాలన చేశారు. వారిని అన్ని రకాలుగా అణగదొక్కాలని వైసీపీ పాలకుడు ప్రయత్నించారు.
అన్ని వర్గాలను భయపెట్టి పాలన సాగించిన వైసీపీ నాయకుడు బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం – జనసేన కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో జయహో బీసీ అనేది నినాదం.. విధానం కావాలి. బీసీ డిక్లరేషన్ ను ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా ప్రచారం చేయాలి. అన్ని ఆలోచించి, ఎంతో మధించి దీన్ని తయారు చేశాం. 3 సంవత్సరాల నుంచి సాధికార కమిటీల ద్వారా, కుల సంఘాలతో, పెద్దలతో మాట్లాడి డిక్లరేషన్ తయారు చేశాం. ఇది చరిత్రలో నిలిచిపోయే డిక్లరేషన్.
50 సంవత్సరాలు దాటిన బీసీలకు పింఛను
40 సంవత్సరాలుగా బీసీలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు బీసీలకు అండగా జనసేన నిలబడింది. 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే 50 సంవత్సరాలకే బీసీలకు పింఛను ఇచ్చేందుకు కారం చుడతాం.
రూ.35లకు పింఛను ఎన్టీఆర్ ప్రారంభించారు. దాన్ని నేను రూ.200 లకు, తర్వాత రూ.2 వేలు చేశాం. రేపు రాబోయే రోజుల్లో పింఛనును రూ.4 వేలు చేసే బాధ్యతను మేం తీసుకుంటాం. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛను ఇచ్చేలా కృషి చేస్తాం. బీసీ సబ్ ప్లాన్ లో ప్రతి ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన జగన్ కనీసం రూ.15 లు కూడా కేటాయించలేదు. ఇదే బీసీలకు జగన్ చేసిన పెద్ద మోసం.
సంక్షేమానికి తోడు సంపద సృష్టి మా సిద్ధాంతం
ప్రజలకు సంక్షేమం ద్వారా తగినంతగా సహాయం చేస్తూనే ప్రభుత్వ ఖజానా నింపేందుకు సంపద సృష్టిస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి రూ.30 వేల కోట్లు వెచ్చిస్తాం. దాని కోసం బీసీల అభివృద్ధికి తగిన తోడ్పాటును అందిస్తాం. 5 ఏళ్లలో రూ.1.50 లక్షల కోట్లు సబ్ ప్లాన్ లో వెచ్చించే ఏర్పాటు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం గా బీసీలకు ఉన్న రిజర్వేషన్లను, వైసీపీ అధికారంలోకి వచ్చాక 25 శాతానికి తగ్గించారు. దీంతో సుమారు 16,800 మంది పదవులు కోల్పోయారు. బీసీలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన 33 శాతం రిజర్వేషన్లు వచ్చేలా పోరాడుతాం. 153 కులాలకు మేం పదవులు ఇవ్వలేకపోవచ్చు. కానీ అందరికీ న్యాయం చేస్తాం. రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే వారికి నామినేటెడ్ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.
బీసీల పరిస్థితిపై అధ్యయనం
కులగణన నిర్వహించాలి. వెనకబడిన వర్గాల్లోని పరిస్థితిని అధ్యయనం చేయాలి. వారి జీవన స్థితిగతులు అధ్యయనం చేసేలా కులగణన చేయాలనే దానికి కట్టుబడి ఉన్నాం. జనాభా దమాషా ప్రకారం సరైన అవకాశాలు ఇచ్చి ఆర్థిక అసమానత తగ్గించడానికి కృషి చేస్తాం.
రాజకీయంగా ఎదుగుతున్న బీసీలను అణగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అత్యాచార నిరోధక చట్టం ఉన్నట్లుగా బీసీలకు తగిన రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం. 5 ఏళ్లలో బీసీల ప్రోత్సాహకానికి రూ.10 వేల కోట్ల నిధిని కేటాయిస్తాం. విద్యా పథకాలన్నీ మళ్లీ పున: ప్రారంభించేలా చూస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య పథకం అందేలా చూస్తాం. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్సుమెంటు ఉంటుంది. చంద్రన్న బీమా రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచుతాం. మట్టి ఖర్చులు ఇస్తాం. పెళ్లి కానుకలు రూ.లక్ష ఇచ్చి పెళ్లి ఘనంగా చేసే బాధ్యత తీసుకుంటాం.
కుల ధ్రువీకరణ పత్రం ప్రతి ఏటా తీసుకోవాలనే నిబంధన తొలగించి, శాశ్వతంగా పత్రాలు తీసుకునేలా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. మధ్యలో ఆగిపోయిన బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల ను ఏడాదిలో పూర్తి చేస్తాం. రజకులను ఎస్సీల జాబితాలో, వడ్డెరలను ఎస్టీ జాబితాలో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం. నేతన్నలకు జీఎస్టీ రద్దు చేసేలా పోరాడుతాం. బీసీల దశ, దిశ మార్చడానికి ఇదో మంచి అవకాశం. బీసీల రుణాల తీర్చుకోవడానికి డిక్లరేషన్ ఇచ్చాం. బీసీలు లేకపోతే నాగరికత లేదు. సమాజ హితం లేదు. అందుకే వారి గురించి నిత్యం ఆలోచించే తెలుగుదేశం – జనసేన పార్టీల కూటమి బీసీలకు బలంగా నిలబడేందుకు వారి ఆశీర్వాదాన్ని కోరుతోంది’’ అన్నారు.