–విభాగాధిపతులపై అసహనం
-నగర కమిషనర్ అత్యవసర సమీక్ష సమావేశం
గుంటూరు, మహానాడు: ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. నగర కమిషనర్ వ్యక్తిగత సెలవులో ఉన్నప్పుడు ఆయా విభాగాధిపతులు తమ విభాగ పనితీరు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని నగర కమిషనర్ జిఎంసి విభాగాధిపతులపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఇవ్వాల్సిన అనుమతులు, విభాగాల వారీగా పెండింగ్ ఫైల్స్ పై కమిషనర్ అత్యవసర సమీక్ష సమావేశం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం సరికాదన్నారు. నగర కమిషనర్ వ్యక్తిగత సెలవులో ఉన్నప్పుడు ఆయా విభాగాధిపతులు తమ విభాగ పనితీరుని మరింత శ్రద్ధగా పర్యవేక్షణ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ప్రజారోగ్యానికి భంగం కలిగేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విభాగాధిపతుల నుండి కింద స్థాయి అధికారుల వరకు గత వారంలో రోజువారీ వర్క్ రిపోర్ట్ ఫొటోలతో సహా అందించాలని ఆదేశించారు. విభాగాల వారీగా ప్రజా సేవలు, సమస్యలకు సంబంధించిన ఫైళ్ల పరిష్కార జాప్యంపై సమీక్షించి, పెండింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్ల పరిష్కారంపై విభాగాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో నగరపాలక సంస్థలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని, రాష్ట్ర విజిలెన్స్ శాఖ నుంచి ఆయా పనులపై సమగ్ర నివేదిక అందించాలని లేఖ పంపారన్నారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విభాగాధిపతులు పూర్తి స్థాయి భాధ్యత వహించాల్సి ఉందన్నారు.
కేవలం కింద స్థాయి అధికారుల రిమార్క్ లతో సిఫార్స్ చేయాల్సిన అవసరం లేదని, అనుమతుల కోసం తమకు సిఫార్సు చేసే ముందే తప్పనిసరిగా సదరు ఫైల్స్ కి సంబందించి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, పనులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మాత్రమే అభివృద్ధి పనుల సిఫార్స్ ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్ఈ శ్యాం సుందర్, సీఎంఓహెచ్ డాక్టర్ ఆషా, ఎంహెచ్ఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.