– జిల్లా ప్రజలకు పెమ్మసాని సూచనలు
గుంటూరు, మహానాడు: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు, జిల్లా యంత్రాంగం ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని, ఎలాంటి ప్రమాదాలు అధికారులు జరగకుండా చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన పునరావాసం కల్పించాలని సూచించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటికి రాకుండా సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, గుంటూరు జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ లోని టోల్ ఫ్రీ 9849904013, 0863-2234014 నంబర్లను సంప్రదించాలని పెమ్మసాని ఈ సందర్భంగా కోరారు.
ముగ్గురు మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది..
భారీ వర్షాలకు శనివారం గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామ శివారు వాగులో కారు ప్రమాదం ఘటనలో ముగ్గురు మృతి చెందిన వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను కకావికలం చేస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో స్కూలు నుంచి ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఒక ఉపాధ్యాయుడు మరణించడం తీవ్రంగా కలిచి వేసిందని చెప్పారు. మృతులు పసుపులేటి సౌరిష్(7), కోడూరి మానవిత్(9), నడుంపల్లి రాఘవేంద్ర(38)కు నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.