అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రెస్క్యూ టీం లను ఏర్పాటు చేసుకోవాలని హైడ్రాకు ఆదేశం
ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి
వరద ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశం
వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖకు ఆదేశం
ఖమ్మం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లు పాల్గొన్నారు. సోమవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చేసిన సూచనలను పాటించి లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావిత ముంపు గ్రామాల్లో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలు తొలగించే పనిలో నిమగ్నమైన హైడ్రా ప్రస్తుతం తొలగింపులను రెండు మూడు రోజుల పాటు విరామం ప్రకటించి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి హైడ్రా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పేర్కొన్నారు.
వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించి తగిన భోజన వసతి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాలని అత్యవసర సేవలకు కావాల్సిన నిధులను ఆర్థిక శాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.
వర్షాల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని ఉదయం మధిర తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. విద్యుత్తు, మంచినీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
వరద నీరు ఉదృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి పరిస్థితిని స్వయంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. మధిర మండలం వంగవీడు గ్రామంలో వాగులో చిక్కుకున్న మత్స్య కార్మికుడు వెంకటేశ్వర్లను రక్షించినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉంది
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉన్నదనీ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత మీడియాతో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
వరద ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులను అప్రమత్తం చేసి ముమ్మరంగా సహాయక చర్యలను చేపడుతున్నట్లు వివరించారు. జంట నగరాల్లో వరదల వల్ల ఏర్పడే విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సన్నద్ధం చేశామని వెల్లడించారు. ఆపరేషన్ రెస్క్యూ టిమ్ లను అందుబాటులో ఉంచామని చెప్పారు.