-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
– గుంటూరులో వైవి రావు మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం
గుంటూరు: మైలవరం నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికవ్వడం తనకు మరింత బాధ్యత పెంచిందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
గుంటూరులో వి కన్వెన్షన్ హాల్లో వైవి రావు మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారికి, ఆయన సతీమణి శిరీష కి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కి, వారి కుటుంబ సభ్యులకు ఆదివారం ఆత్మీయ సత్కారం నిర్వహించారు. తొలుత అన్న దివంగత ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూల బొకేలను అందజేసి ఘనంగా సత్కరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆత్మీయ సత్కారం కన్నులపండువగా జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానన్నారు. అలానే పార్టీ మారేందుకు గల కారణాలు వెల్లడించారు. తనకు తెలుగుదేశం పార్టీలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆశీస్సులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు కి, మంత్రి లోకేష్ బాబు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరులో చిన్ననాటి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. తనకు రాజకీయంగా, ఇతరత్రా విషయాలలో మార్గదర్శకులుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
40 ఏళ్ల సుదీర్ఘ కాలంలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు. పేదలకు కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో అన్న ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి, పేదల సంక్షేమానికి పునాదులు వేశారన్నారు.
ఆనాడు సీఎం ఎన్టీఆర్ తో కలసి పనిచేసే అవకాశం తన తండ్రి వసంత నాగేశ్వరరావు కి దక్కిందని, నేడు సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే తన సిద్ధాంతమన్నారు.
తనను ఎంతో గౌరవించి రెండో పర్యాయం ఎమ్మెల్యే గెలిపించి గౌరవించిన వారందరికీ తన వల్ల ఎప్పటికైనా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి ఉంటుంది తప్పితే తల దించుకునే పరిస్థితి ఎప్పటికీ మాత్రం రాదని మాటిచ్చారు.
తనను ఎంతో అభిమానించి ఘనంగా సత్కరించిన వైవి రావు మిత్రమండలి సభ్యులకు, ఆత్మీయులకు, ఆత్మ బంధువులకు, తనకు ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కష్టపడిన వారందరికీ ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ముందుగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కి ఘనస్వాగతం లభించింది. గుంటూరు జిల్లాలోని ఆత్మీయులతో పాటు మైలవరం నియోజకవర్గంలోని తెదేపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.