– రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇవ్వాలి
– వ్యవసాయ శాఖ అధికారులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన
వెంకటాపురం, మహానాడు: రాప్తాడు నియోజకవర్గంలో కంది పంటకు ప్రమాదకర పురుగు వ్యాపించిందని.. దీని వలన పంట దెబ్బతింటుందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రంలో సాగు చేస్తున్న కంది పంటను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అసలు కంది పంటకు ఏ పురుగు ఆశించింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఆరా తీశారు.
ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారి మాట్లాడుతూ కంది పంటకు ప్రస్తుతం మరూక అనే మచ్చల పురుగు వ్యాపించిందని.. దీని వలన పంట దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి సకాలంలో ఎమామెక్టిన్ బెంజోట్ ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్, డెల్టామెత్రిమ్ ఒక లీటర్ నీటికి ఒక ఎమ్.ఎల్ మందులు పిచికారి చేసుకోవాలని సూచించారు. మరోవైపు పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో 25వేల ఎకరాల వరకు కంది పంట సాగు చేశారని పురుగు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పొలాలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో పురుగు నివారణకు రైతులు ఇష్టం వచ్చిన మందులతో పిచికారి చేసి మరింత నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. అధికారులు సకాలంలో తగిన సూచనలు చేయాలని ఆమె ఆదేశించారు.