సీపీఐ నేతలతో భట్టి విక్రమార్క చర్చలు

-పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం
-మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకేనని వెల్లడి

హైదరాబాద్‌, మహానాడు: సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివా రం చర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సూచన మేరకు సీపీఐ నాయకులతో చర్చించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతు, రాజకీయ అంశాలను చర్చించడం జరిగిందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో లౌకికవాదాన్ని కాపాడే క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు ఇరు పార్టీలు కలిసి ప్రయాణించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కలిసి ముందుకు సాగుతామని వివరించారు. మతోన్మాద బీజేపీని అడుగు పెట్టకుండా కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలోకి మతోన్మాద బీజేపీని అడుగుపెట్టకుండా చేసేందుకు నిటారుగా నిలబడి మనమంతా కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. కూనంనేని మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేసేలా అవగాహన కుదిరినట్లు తెలిపారు.