-పేరు బీసీ.. పదవి ఓసీకి!
-ఎన్నికల ప్రచారంలో బీసీ నినాదం
-బీసీని సీఎం అభ్యర్ధి గా ప్రకటించిన బీజేపీ బీజేఎల్పీ నేతగా -మహేశ్వరరెడ్డి బీజేపీలో మాయమైన బీజేపీ నినాదం బీసీ పోయి రెడ్డి వచ్చే ఢాం
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీది గత ఎన్నికల ముందువరకూ బీసీ నినాదం. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీది బీసీ నినాదం. తెలంగాణలో కాలం కర్మం కలసి వచ్చి బీజేపీ గెలిపిస్తే.. బీసీ ఎమ్మెల్యేనే సీఎం చేస్తామని భాజపా హామీ ఇచ్చేసింది.
కానీ ఎన్నికల్లో పార్టీ ఓడింది. అయినా బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. మరి ఆ లెక్కన బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి కూడా బీసీకే ఇవ్వాలి కదా? ఎన్నికల ముందు అమితా చెప్పిదాని ప్రకారమైతే అదే జరగాలి. కానీ ఆ పదవి బీసీకి బదులు ఓసీకే దక్కింది. ఇదీ బీజేపీ సామాజికవర్గ సిద్ధాంతం!
తెలంగాణ బీజేపీ శాసనసభాపక్షగా, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని నియమించారు. ఇది పార్టీలో వివాదానికి దారి తీసింది. ఎన్నికల ముందు పార్టీ గెలిస్తే సీఎంగా బీసీని నియమిస్తామని, కేంద్రహోంమంత్రి అమిత్ ప్రకటించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. నేపధ్యంలో బండి సంజయ్ సీఎంగా ప్రచారంలోకి వచ్చింది.
ఆ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి, బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి సహజంగా బీసీకే ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయి.
కానీ అందుకు భిన్నంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన మహేశ్వర్రెడ్డికి… బీజేఎల్పీ నేత పదవి ఇవ్వడంతో, బీజేపీలోని బీసీ వర్గాలు ఖంగుతిన్నాయి. కొద్దిరోజుల క్రితం రాజాసింగ్ సైతం.. బీజేఎల్పీ నేత పదవిని, బీసీకి ఇవ్వాలని పార్టీ జాతీయ నాయకత్వం యోచిస్తోందని వెల్లడించారు. దానితో బీసీ ఎమ్మెల్యేకే బీజేఎల్పీ నేత పదవి దక్కుతుందని ఆశించారు.
అయితే కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చక్రం తిప్పడంతో కథ అడ్డం తిరిగి.. బీసీ స్థానంలో ఓసీ రెడ్డి ఎమ్మెల్యే రంగప్రవేశం చేశారు. అయితే కిషన్రెడ్డి సహజంగా మహేశ్వర్రెడ్డినే సిఫార్సు చేస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. ఆ ప్రకారంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు – బీజేఎల్పీ వంటి రెండు కీలకపదవులకూ.. పార్టీ నాయకత్వం ‘రెడ్డి’ కార్పెట్ వేసినట్టయింది.