కార్యకర్తల పట్టుదలతోనే బలమైన పార్టీగా బీజేపీ!

– రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైన పార్టీ.. ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త సభ్యులని చేర్చుకోవటంతో పాటు బూత్ అధ్యక్షులని, మండల అధ్యక్షులని, రాష్ట్ర అధ్యక్షులని ప్రజాస్వామ్యం పద్ధతి ద్వారా ఎన్నుకుని ముందుకి వెళ్తున్నాం.. ప్రధాని మోదీ తో సహా అందరు వారి సభ్యత్వాన్ని పునరుద్దరించుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. స్థానిక ఐవీ ప్యాలెస్ లో సంఘటన్ పర్వ రాష్ట్ర కార్యశాలలో ఆమె ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు.

పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా పాకా సత్యనారాయణ నియామకమయ్యారని పురందేశ్వరి సభ్యులు హర్షధ్వానాలు మధ్య ప్రకటించారు. అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా బిట్రా శివన్నారాయణ, మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి, సురేష్ రెడ్డి లను నియమించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమె ఇంకా ఏమన్నారంటే.. 2014 లో ఆరు నెలల పాటు సభ్యత్వాన్ని నమోదు చేసాం. ఆన్లైన్ ద్వారా మొదటి సారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో 11 కోట్ల సభ్యత్వాన్ని ఆరునెలలో చేశాం. ఇప్పుడు 45 రోజుల్లోనే 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేశాం. భవిష్యత్ లో బీజేపీని ఒక బలమైన రాజకీయ పార్టీ గా నిలబెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త చేసిన కృషి ధన్యవాదాలు. జాతీయ స్థాయిలో పరిపాలనా దక్షత కనచిరి దేశాన్ని ఆగ్రగామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీది. ఏపీ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర రాజధాని అమరావతి కనెక్టివిటీ కొరకు రైల్వే నిర్మాణం చేపట్టడం సంతోషకరం. రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తోంది. గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులని పక్క దారి పట్టించిన విధానాన్ని పవన్ కల్యాణ్‌ సైతం గ్రామ సభల్లో వివరించారు. దేశంలో ఎన్‌డీఏ ఉండాలి… రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వై.సత్య కుమార్ యాదవ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, సభ్యత్వ ప్రముఖ్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఎమ్మెల్యే లు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, డాక్టర్ పార్థసారథి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయచౌదరి, సాగి కాశీ విశ్వనాథ్ రాజు వేదికను అలంకరించారు.