ఎల్లవేళలా మహిళల పక్షానే బీజేపీ

– రాహుల్‌ వ్యాఖ్యలు అభ్యంతకరం
– ఖండించిన మహిళా మోర్చా

గుంటూరు, మహానాడు: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డల్లాస్ యూఎస్ఏ లో భారతీయ మహిళల గురించి భారతీయ జనతా పార్టీ చిన్నచూపు చూస్తోంది… వాళ్ళు కేవలం వంటింటికే పరిమితమై ఉండాలని.. వాళ్ళ కలలు, ఆశయాలు సాకారం చేసుకోవడానికి వీల్లేదనే తప్పుడు వ్యాఖ్యలు చేశారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేతలు మండిపడ్డారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక యోగి భవన్ ప్రాంగణంలో గుంటూరు మహిళా మోర్చా ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు.

మహిళా మోర్చ అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి మాట్లాడుతూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మహిళల కోసం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను వివరించారు. బేటీ బచావో బేటి పడావో, స్వచ్ఛభారత్ అభియాన్, మహిళల స్వాభిమానాన్ని కాపాడేలా మరుగుదొడ్లను నిర్మించడం, జనధన్‌ వంటి కార్యక్రమాలు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. బీజేపీ ఎప్పుడూ మహిళల పక్షానే ఉంటుందని, మహిళల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావిస్తోందని ఆదర్శ ప్రధానమంత్రి మోడీ అన్నారన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మహిళా మోర్చా కోశాధికారి డాక్టర్ స్రవంతి సి హెచ్ మాట్లాడుతూ నిజంగా మహిళలు వంటింటికే పరిమితం కావాలి అని అనుకుంటే ఎందుకు 33% రిజర్వేషన్ ని మోడీ తీసుకువస్తారని ఘాటుగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా సభ్యురాలు గాయత్రి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.