ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు తెచ్చుకుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2014లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ పదేళ్లు పూర్తి చేసుకుంటున్నాం. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి మొదలు ప్రతి ఒక్కరు పాత సభ్యత్వ పునరుద్ధరణ (రెన్యువల్) చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో చైనా కమ్యూనిస్టు అతిపెద్ద పార్టీగా ఉండేది.

2014 తర్వాత కమ్యూనిస్టు పార్టీని వెనక్కు నెట్టివేసి బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది… భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్వించదగినది… దేశ వ్యాప్తంగా సభ్యత్వ సేకరణ కార్యక్రమం అక్టోబరులో ప్రారంభమవుతుంది… సభ్యత్వ నమోదు కార్యక్రమం సన్నాహక సమావేశాలు, వర్క్ షాపులు నిర్వహించి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సభ్యత్వ సేకరణపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.. ఈసారి తెలంగాణలో రైతులు, మహిళలు, యువత ప్రధాన లక్ష్యంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నాం… గత ఎన్నికల్లో సుమారు 77 లక్షల మంది ప్రజలు బీజేపీ కి అనుకూలంగా మద్దతు తెలిపారు.

కాంగ్రెస్‌ అధికారిలోకి వచ్చినా పరిస్థితులు మారలేదు…

బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితులు మారలేదని కిషన్‌ రెడ్డి విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మేలుకోసమే పాలన చేశారు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. సుమారు 400 పైచిలుకు హామీలు, 6 గ్యారంటీల పేరుతో మభ్యపెట్టింది. ప్రజలు నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల పట్ల విసిగివేసారిపోయారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగడానికి బీజేపీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మలుచుకుని ముందుకెళ్తాం.

స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినప్పటికీ ఇప్పటికీ కేసీఆర్ కుటుంబంతో పాటు ఆ పార్టీ నాయకుల ఆలోచన మారలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహంతో కాంగ్రెస్ కు ఓటేశారు తప్పితే.. కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసంతో కాదు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని, ఆ కమిటీల నేతృత్వంలో ప్రజాక్షేత్రంలో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాం. గతంలో గాంధీ భవన్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కి.. నేడు తెలంగాణ భవన్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ కు వెళ్తున్న పరిస్థితి. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ఒకేతాను ముక్కలు. ఈ రెండు పార్టీల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి.

ఫీజు రీ యింబర్స్‌ మెంట్‌ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించలేదు. విద్యార్థులకు స్కాలర్ షిప్పులు చెల్లించడం లేదు. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేయడానికే కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల ఆలోచన. బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ రాలేదు.. కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలన రాలేదు.. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలి. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది. సెప్టెంబరు 30వ తేదీ లోగా జమ్ము కశ్మీర్ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్ లో 2014కు ముందు పరిస్థితులు దారుణంగా ఉండేవి.

ఆర్టికల్ 370 ని రద్దు చేసి జిన్నా రాజ్యాంగం తీసేసి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అమలు చేశాం. నేడు మహిళలకు ఆస్తి హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలతో పాటు, రిజర్వేషన్ల అమలు, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలతో జమ్ము కశ్మీర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది. దేశ వ్యతిరేక శక్తులతో కలిసి కాంగ్రెస్ నాయకులు వ్యవహారం నడుపుతోంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.