– పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వం కోటికి పెరగాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పెనములూరులో బుధవారం సభ్యత్వ నమోదుపై పార్టీ సమావేశం జరిగింది. పురందేశ్వరి అధ్యక్షత వహించి, మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది బాధ్యతని అన్నారు. పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం.. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కొరకు గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాం… దానిని చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలి. పాశ్చాత్య ఆలోచన ధోరణి కి స్వస్తి పలికెందుకు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆలోచనల నుంచి బీజేపీ ఆవిర్బవించింది. అప్పటి నుంచి ఒక సిద్ధాంతంతో, కార్యకర్త బలంతో ముందుకు వెళుతోంది.. 1984 లో పార్లమెంట్ సభల్లో ఇద్దరితో ప్రయాణం మొదలైందన్నారు. ప్రస్తుతం దేశ అభివృద్ధి కొరకు బీజేపీ ప్రభుత్వం పని చేస్తోంది. భారతీయ సంస్కృతి విధి విధానాలతో బీజేపీ ముందుకువెళుతోంది. మోదీ నాయకత్వం లో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సిద్ధాంతంతో పాలిస్తోంది. అనంతరం సభ్యత్వ నమోదు రాష్ట్ర ప్రముఖ్ గా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ని పురందేశ్వరి ప్రకటించారు. సభ్యులుగా సురేంద్ర మోహన్, మట్టా ప్రసాద్, వల్లూరు జయప్రకాష్, సిహెచ్ సావిత్రి, జీసీ నాయుడులు ఉంటారు.
పార్టీ ఏపీ సభ్యత్వ ఇంచార్జి, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ ప్రసంగిస్తూ సభ్యత్వ నమోదులో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. అదేవిధంగా సభ్యత్వ నమోదులో కార్యకర్తలే కీలక పాత్రదారులన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని సభ్యత్వ నమోదు పార్టీ బలాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ దృష్ట్యా నిర్దేశిత సమయంలో సభ్యత్వ నమోదు నిర్వహించాలన్నారు. ఏఏ సందర్భాల్లో సభ్యత్వ నమోదు చేస్తే వేగంగా ఈ కార్యక్రమం పూర్తి చేయగలమో వివరించారు. బీజేపీ సర్వవ్యాపి, సర్వస్పర్శి… అందువల్ల జాతీయ భావాలు కలిగిన కార్యకర్తల గణం బీజేపీ సొంతం అన్నారు.
యూపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్ధార్థనాథ్ సింగ్ ప్రసంగిస్తూ భారతీయ జనసంఘ్ ఏర్పడిన 1952 నుండి ఇప్పటి వరకు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జిల పార్టీ సిద్ధాంతం మారలేదన్నారు. రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సభ్యత్వ నమోదు పై పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు, విప్ సి.ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే లు కామినేని శ్రీనివాస్, సుజనాచౌదరి, డాక్టర్ పార్థసారథి, ఎన్.ఈశ్వర రావు, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, సభ్యత్వ నమోదు రాష్ట్ర ప్రముఖ్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, తదితరులు వేదికను అలంకరించారు.