Mahanaadu-Logo-PNG-Large

సంపన్నులకు వరాలు.. పేదలకు సవతి ప్రేమ

-కేంద్ర బడ్జెట్లో దళిత ఆదివాసీలకు మొండిచేయి
-దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

విజయవాడ , మహానాడు:  సబ్ కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రధానమంత్రి నినాదానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తిలోదకాలు ఇచ్చి, దళిత ఆదివాసీలకు మొండి చెయ్యి చూపించారని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. చిట్టిబాబు అన్నారు. నేషనల్ క్యాంపెయిన్ దళిత హ్యూమన్ రైట్స్, దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయింపులపై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో  దళిత ఆదివాసీ బడ్జెట్ విశ్లేషణ నివేదికను చిట్టిబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో సమానత్వం సాధన దిశగా,పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన చర్యలు లేని నిరాశ జనకమైన బడ్జెట్. సంపన్న,కార్పొరేట్ వర్గాల బడ్జెట్ అని, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం నినాదంగా మాత్రమే ఈ బడ్జెట్ మిగిల్చిందని తెలిపారు.

కేంద్ర వార్షిక బడ్జెట్ 2024-25 లో  మొత్తం బడ్జెట్ 51,89,144కోట్లు కాగా,  సెంట్రల్ సెక్టార్ సెంట్రల్ మరియు సెంట్రల్ స్పాన్సర్ క్రింద అభివృద్ధి కోసం 14,64,479 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం 2,14,109 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 165493 కోట్లు, మాత్రమే కేటాయించారు.  ఈ నిధుల్లో కూడా 46192 కోట్లు మాత్రమే ఎస్సీ లకు ఉపయోగపడే పథకాలకు ఇచ్చారు. ఎస్టీలకు 1,24,909 కోట్లు కేటాయించి అందులో 41730 కోట్లు మాత్రమే ఎస్టిలకు  ప్రత్యక్షంగా ఉపయోగపడే పథకాలకు కేటాయించారు. అత్యధిక భాగం ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడని పథకాలకు నిధులు ఇచ్చి, మరో ప్రక్క జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించక తీవ్ర అన్యాయం చేశారన్నారు.

దేశంలో ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు పెరుగున్న నేపథ్యంలో, అత్యాచారాల నిర్మూలనకు అట్రాసిటీ చట్టం అమలుకు బడ్జెట్ పెంచకపోగా  550 కోట్లు మాత్రమే కేటాయించి కేంద్రం చేతులు దులుపుకుందన్నారు. నేషనల్ సఫారీ కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు గతంలో 10 కోట్లు కేటాయించగా, ఇప్పుడు కేటాయింపులు లేవు. ఇదే తరహాలో జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ కు గతంలో 15 కోట్లు కేటాయించగా  ఈసారి బడ్జెట్ కేటాయించక పోవడం, ఎస్సీ ఎస్టీలకు అత్యధికంగా ఉపయోగపడే పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ కు గత సంవత్సరం కంటే తక్కువ నిధులు కేటాయించడం చాలా విచారకరమని, దీనివల్ల ఆదివాసీలను ఉన్నత విద్యకు దూరం చేస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్పోరేట్ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సామాన్య పేద ప్రజల మౌలిక వస్థలకు గాని వారి ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన కొనుగోలు శక్తి పెరుగుదలపై శ్రద్ధ వహించకపోవడం తో చాలా అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్  రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్లు అప్పు ద్వారా కేటాయించారు తప్ప మిగతా అన్నింటికీ హామీలు ఇచ్చారు తప్ప అంకెలు ఎక్కడ చెప్పలేదు. ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేదు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ల ఆర్థిక అభివృద్ధి కోసం సవరణల బడ్జెట్లో మార్పులు తీసుకురావాలని, మాన్యువల్ స్కావెంజింగ్ సిస్టాన్ని రద్దు చేయడానికి వారి పునరావాసం కోసం నిధులు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ పథకాల అమలుకు నిర్దిష్టమైన చర్యలు భాగంగా  దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకుని రావాలి ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు నిరోధానికి నిధులను పెంచాలని,ఎస్సీ ఎస్టీలకు  నేరుగా ఉపయోగపడే పథకాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో డి.బి ఎస్ యు రాష్ట్ర నాయకులు కె.సి.హెచ్ బంగార్రాజు,దళిత ఐక్య వేదిక కన్వీనర్ రవికుమార్,ప్రజ్వల సంఘం ప్రతినిధి కొమ్ము నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు