బేగంపేట ఎయిర్‌పోర్టులో బాబుకు బ్రహ్మరథం

-బాబొచ్చారొచ్చారు!
– పోటెత్తిన జనం
– దారి పొడవునా ఫ్లెక్సీలతో స్వాగతం
– డీజే, డాన్సులతో కోలాహలం
– కాలనీల నుంచి తరలివచ్చిన జనం
– అదుపుచేయలేక పోలీసుల సతమతం
(అన్వేష్)

ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. టీడీపీ కార్యకర్తలతోపాటు, వివిధ కాలనీల నుంచి మహిళలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడం ఆశ్చర్యపరిచింది. జగన్ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసిన వైనంపై ఆందోళన చేసిన మహిళలు, బేగంపేట ఎయిర్‌పోర్టుకు కుటుంబసభ్యులతో సహా తరలిరావడం విశేషం.

చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లే మార్గం దారిపొడవునా ఆయనను స్వాగతిస్తూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. డీజేలు, లంబాడా డాన్సు, క్రేన్లతో భారీ పూలమాలతో బేగంపేట పరిసరాలు కోలాహలంగా కనిపించాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత బాబుకు హైదరాబాద్‌లో ఈ స్థాయిలో స్వాగతం లభించడం విశేషం. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఎల్బీనగర్ నియోజవకర్గాల నుంచి భారీ స్థాయిలో జనం స్వచ్ఛందంగా హాజరుకావడం విశేషం.
రాష్ట్ర ఇనార్చి కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరోభ్యులు బక్కిని నర్శింహులు, అరవిందకుమార్ గౌడ్, రాష్ట్ర నేతలు కాట్రగడ్డ ప్రసూన, పిన్నమనేని సాయిబాబా, నర్శిరెడ్డి, మండూరి సాంబశివరావు, కాశీనాధ్, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం, సామ భూపాల్‌రెడ్డి, శ్రీపతి సతీష్, తిరునగరి జోత్స్న, భవనం షకీలారెడ్డి, అశోక్, నల్లెల కిశోర్, వెంకటేష్‌గౌడ్, కానూరు జయశ్రీ, లీలాపద్మ, డాక్టర్ ఏఎస్ రావు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధసంస్థల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు.

పోటెత్తిన పొగాకు, షకీలా ఫ్లెక్సీలు
చంద్రబాబునాయుడును స్వాగతిస్తూ తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం, భారీ స్థాయిలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షించాయి. బాబు స్వాగతానికి ఆయన భారీ స్థాయిలో కార్యకర్తలను సమీకరించారు. చంద్రబాబు నివాసం వరకూ ఆయన భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి , వెంకటేష్ గౌడ్ కూడా జూబ్లీహిల్స్ దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం కనిపించింది.

పాసులు ఇవ్వకపోవడంపై నేతల ఆగ్రహం
కాగా బేగంపేట ఎయిర్‌పోర్టులో బాబును ఆహ్వానించేందుకు కొందరిని మాత్రమే అనుమతించడంపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు రూపొందించిన జాబితాపై వివాదం రేగింది. అసలు రాష్ట్ర కమిటీనే రద్దయినప్పుడు, ఎవరికివాళ్లు ఎలా పెత్తనం చేస్తారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 54 మందికే పాసులివ్వడం ఏమిటని, అందుకు వారికి ఎవరు అధికారం ఇచ్చారంటూ నేతలు మండిపడ్డారు. ‘కమిటీ లేదు. దానితో తమకు తాము పెద్దలీడర్లుగా ఫీలవుతున్న వాళ్లు సొంత పెత్తనాలు చేస్తున్నారు. దీనిపై మేం సారుకు ఫిర్యాదు చేస్తాం. అసలు ఎవరి మాట వినాలో అడుగుతాం. పార్టీ ఆఫీసులో కూర్చుని కొందరు, బయట మరికొందరు మాపై పెత్తనం చేస్తున్నారు. రాష్ట్ర ఇన్చార్జికి చెబుతామంటే ఆయన ఆఫీసులో ఉండరు. ఫోన్లు తీయరు. కాబట్టి త్వరగా ఒక అధ్యక్షుడిని ప్రకటించమని అడుగుతాం’’ అని ఓ సీనియర్ నేత స్పష్టం చేశారు.