బీఆర్ఎస్- కాంగ్రెస్ విద్యా వ్యవస్థను అధ:పాతాళానికి తీసుకెళ్లాయి

అగ్రికల్చర్‌ విభాగంలో 37వ స్థానంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ
100 లోపు ర్యాంకింగ్స్ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీ లేకపోవడం బాధాకరం
14028 స్కూళ్లలో విద్యార్థినులకు టాయిలెట్స్ కూడా లేవు
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్ : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యంతో విద్యా వ్యవస్థను అధ:పాతాళానికి తీసుకెళ్లాయి.తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన యూనివర్శిటీలు నేడు అట్టడుగు స్థాయికి దిగజారాయి. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు అట్టడుగున నిలిచాయి.

దేశంలో ఉస్మానియా యూనివర్శిటీ 2022లో 46వ ర్యాంకు, 2023లో 64 ర్యాంకు, 2024లో 70 వ ర్యాంకుకు పడిపోయిన పరిస్థితి. అగ్రికల్చర్‌ విభాగంలో 37వ స్థానంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నిలిచింది.100 లోపు ర్యాంకింగ్స్ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీ లేకపోవడం బాధాకరం.

విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా తయారైంది. యూనివర్సిటీల్లో విద్య మెరుగుపడాలంటే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఫండ్ ఇవ్వాలి. కానీ, వర్సిటీల్లో 2400 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఓయూలో మొత్తం పోస్టులు 1268, అందులో ఖాళీ పోస్టులు 848 పోస్టులు.. కేయూలో మొత్తం 403 పోస్టులు, ఖాళీ పోస్టులు 295.

తెలంగాణ 150 పోస్టులకు 75 ఖాళీలు, మహాత్మాగాంధీ 150 పోస్టులకు 115 ఖాళీపోస్టులు, శాతవాహనలో 120 పోస్టులకు గాను 100 ఖాళీలు, పాలమూరులో 150 పోస్టులకు 130 ఖాళీలు, బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో 84 పోస్టులకు గాను 58 ఖాళీ ఉద్యోగాలు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 115 పోస్టులకు 97 ఖాళీలు పేరుకుపోయాయి.

యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఉమ్మడి రాష్ట్రంలో 2005లో ఒక హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు.రాష్ట్రంలోని ఖాళీలను రెండు దఫాలుగా భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదికిచ్చింది. అప్పటి నుంచి 2013వరకు కొన్ని నియామకాలను పూర్తి చేశారు. ఈ నియామకాలన్నీ 2005లో గుర్తించిన ఖాళీ పోస్టులు మాత్రమే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో మరో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ సూచనలో భాగంగా 2017లో 1,061 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు.

గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వర్సిటీల్లో ఒకసారి మాత్రమే నామమాత్రంగా నియమకాలు జరిపింది. మే నెల తర్వాత అన్ని వర్సిటీల్లో వీసీల నియామకం పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఒక్క సెర్చ్ కమిటీ కూడా వేయకపోవడం బాధాకరం. ఇంచార్జ్ వీసీలతో కాలం వెల్లదీస్తున్నారు.

రూ. 7510 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు పేరుకుపోయాయి. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పైసా విదిల్చలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారయ్యాయి. విద్యా సమాచార వ్యవస్థ సర్వే నివేదిక ప్రకారం.. 30014 పాఠశాలలకు గాను 25217 పాఠశాలల్లో మాత్రమే తాగునీటి సదుపాయం ఉంది.

రాష్ట్రంలో 14028 స్కూళ్లలో విద్యార్థినులకు టాయిలెట్స్ కూడా లేవు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల టీచర్ పోస్టులను భర్తీచేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయింది.నేషనల్ అచీవ్ మెంట్ సర్వే 2021 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల రాష్ట్ర సగటు ప్రదర్శనలో 36.7 మాత్రమే ఉంది.రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్ష్లల మంది విద్యార్థులుంటే.. 10 వేల ప్రైవేటు స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నరు.

రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే స్కూల్ ఎడ్యుకేషన్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన కలుగుతోంది.ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అమలులో వైఫల్యం చెందింది.

ఉద్యమ కాలంలో జై తెలంగాణ అంటూ ఉరిమిన యూనివర్సిటీలను నేడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, తగిన నిధులను ఇవ్వకపోవడంవంటి కారణాలతో యూనివర్సిటీల్లో నాణ్యత తగ్గిపోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల పట్ల నిర్లక్ష్యం వీడి రీసెర్చ్ కోసం నిధులు కేటాయించాలి, వీసీల నియామకం పూర్తి చేయడంతో పాటు స్కూళ్లలో టీచర్ల నియామకం చేపట్టి, కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనపోతే తగిన బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.