Mahanaadu-Logo-PNG-Large

మళ్లీ ‘కొల్లు’వు దీరిన మట్టి దందా

-బందరులో మళ్లీ తెరపైకి మట్టిదందా
-మంత్రి కొల్లు పేరుతో వ్యాపారం
-అప్రతిష్ఠ అంటూ తమ్ముళ్ల హెచ్చరికలు
(బహదూర్)

హథ విధీ.. ప్చ్.. ఇదేం ఖర్మమని గోలం చేశాం. జనం కూడా ఏమాత్రం సహించలేదు. బందరు మట్టి బాబులకు అత్తారింటికి దారి చూపించారు. అందరూ అనుకున్నట్టే.. వాళ్లు పోయారు. ఇప్పుడు వీళ్లొచ్చారు. ఈ దందా మారదా? అని జనం నెత్తినోరు కొట్టుకునే స్థితి దాపురించింది. మైన్స్ శాఖ మంత్రి ఇలాఖాలోనే .. మళ్లీ మట్టి గ్యాంగ్ తెరమీదకు వచ్చింది. అదీ ఈ సారి చొక్క మారింది.

మంత్రి పదవి తీసుకుని నెల రోజులు కాలేదు.. అప్పుడే మంత్రిగారి సామంతులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు. మట్టి జోలికి వస్తే తాట తీస్తాం అని మంత్రి మీడియా ఎదుట గర్జిస్తుంటే… ఊళ్లల్లో ప్రొక్లెయిన్లు మార్మోగుతున్నాయి. అదే మంటే ఎలక్షన్ లో కోట్లు ఖర్చు చేశాం.. ఆ డబ్బు ఎవరు ఇస్తారని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ముడా భూముల్లో పాగా వేసినోళ్లను జనం సాగనంపితే.. ఇప్పుడు మంత్రి దండు .. మట్టి దండుగా అవతరించింది.

బందరు మండలంలో గతంలో మట్టి తోలినోళ్ల దగ్గరే ట్రాక్టర్లను కొనేస్తున్నారు. ఓ పక్కన పోర్టు పనులు జరుగుతుంటే.. ఆ పక్కనే మట్టి తవ్వేస్తున్నారు. ఇదేంటి అంటే.. ఇది సొంత భూమి అండి.. ఊళ్లకి తోలుతున్నాం అంటున్నారు. ఈ భూమిని ముడాకు అమ్మేసి.. మళ్లీ మా భూములే అంటున్నారు. ఏదేమైనా.. గత 20 రోజులుగా మేకవాని పాలెంలో రాత్రి పగలు తేడా లేకుండా, ప్రొక్లెయిన్లు విజృంభిస్తున్న విషయం ఈ రోజు వెలుగు లోకి రావటం విశేషం.

రెవెన్యూ, పోలీసులు మేకవాని పాలెం వెళ్లారంటే గొప్ప విషయమే. అప్పటికే యంత్రాలు, ట్రాక్టర్లతో మట్టి బాబులు పారిపోయారనే కబురును ముడా అధికారులు స్ఫష్టం చేశారు. ఈ వాహనాలతో పారిపోయారా? లేక మీరే వార్నింగ్ ఇచ్చారా? అదే జనం అనుమానం.

ఇలాంటి దందాలు చేసిన పేర్నిని ప్రజలు ఇంటికి పంపించారు. మళ్లీ అదే తప్పులు తాము చేస్తే ప్రజలు ఎలా క్షమిస్తారని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇవి పార్టీకి అప్రతిష్ఠ తీసుకువచ్చే చర్యలని వారు స్పష్టం చేస్తున్నారు.