కాల్‌ మీ బే అంటున్న అనన్య

ఇటీవల కాలంలో సినిమా టైటిళ్లు వెరైటీగా పెట్టి దాంతోనే క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్‌. అలాంటి ఒక టైటిల్ `కాల్ మీ బే`. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా ప‌డిపోయిన అన‌న్య పాండేను ఆదుకోవాల్సిన లేటెస్ట్ మూవీ ఇది. పాండే ప్రధాన పాత్రలో నటించిన `కాల్ మీ బే` కామెడీ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కరణ్ జోహార్ సోమవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త‌ పోస్టర్‌ను షేర్ చేసి ఈ సిరీస్ సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంద‌ని ప్రకటించారు. కొత్త పోస్టర్‌లో అన‌న్య‌ ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించి, సూట్‌కేసులపై కూర్చుని కెమెరా వైపు చూస్తోంది. అనన్య పాండే బెల్లా బే చౌదరి అనే పాత్రలో న‌టిస్తోంది. 8-భాగాల సిరీస్‌లో వీర్ దాస్, గుర్ఫతే పిర్జాదా, వరుణ్ సూద్, విహాన్ సమత్, ముస్కాన్ జాఫేరి, నిహారిక లైరా దత్, లిసా మిశ్రా, మినీ మాథుర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇషితా మోయిత్రా, సమీనా మోట్లేకర్, మరియు రోహిత్ నాయర్ ర‌చ‌యిత‌లు. కొలిన్ డికున్హా దర్శకత్వం వహించారు. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లు.. అనన్య పాండేకు ఓటీటీలో ఇది తొలి వెబ్ సిరీస్. ఇంత‌కుముందు అన‌న్య న‌టించిన ఖ‌లీ పీలి చిత్రం ఓటీటీలో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనన్య పాండే చివరిసారిగా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి `డ్రీమ్ గర్ల్ 2`లో కనిపించింది.