* కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా?
* అరాచక పెదిరెడ్డిపై ఇప్పటికే చర్యలు తీసుకోలేదు
* సర్కారు తీరుపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ మండిపాటు
విజయవాడ: “మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేస్తే ఇప్పటికీ విచారణ పేరుతో సాగదీస్తున్నారు.. భూములు కబ్జా చేసి, అరాచకాలు చేసిన పెద్దిరెడ్డి పై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.” అంటూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మండి పడ్డారు.
సర్కారు తీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ కీలక ప్రశ్నలు సంధించారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అరాచకాలు, ఈ ప్రభుత్వ వైఖరి, పెద్దిరెడ్డి విషయంలో నిర్లప్తత అంశాలపై సుధీర్ఘంగా మాట్లాడారు..
పెద్దిరెడ్డి అక్రమాల నిగ్గు తేల్చలేరా?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అరాచక వాది.. భూ కబ్జాలు చేశాడు, రైతుల నుండి పాలను తక్కువ ధరకు దోచుకున్నాడు.. భూములు లాక్కుని పరిహారం ఎగ్గొట్టాడు.. ప్రజలను బెదిరించి భయపెట్టి, అధికారులను లొంగ దీసుకుని అక్రమాలు చేశాడు.. వీటిపై అసలు విచారణ లేకుండా.. పుంగనూరు నియోజకవర్గంలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. అటువంటి పాపాల పెద్దిరెడ్డిని ఇప్పటికీ ఏమి చేయలేకపోయారు.. పుంగనూరు వస్తే చంద్రబాబుపై రాళ్ళు వేయించి, తిరిగి అతనిపైనే అక్రమ కేసు పెట్టించి, క్యాడర్ నీ హింసించిన వ్యక్తిపై ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రేమ చూపిస్తుంది. ఏమైనా అతనితో రహస్య బంధం కొనసాగిస్తున్నారా..? అంటూ నిలదీశారు.
ప్రజల అభీష్టం అనుగుణంగా పాలిస్తేనే..
రాష్ట్రంలో ప్రజలు గత అయిదేళ్ల పాలనతో విసిగిపోయారు. అరాచకాలు, అవినీతి, వివాదాలు, కక్ష సాధింపులు, కేసులుతో అంతా రివర్స్ పాలన సాగించారు. దీంతో ప్రజలు కూటమికి చారిత్రక తీర్పు ఇచ్చారు.. ఈ తీర్పు చంద్రబాబు బ్యాచ్ పై బాధ్యత పెంచింది. అందుకు అనుగుణంగా పరిపాలన సాగించాలి. గత అవినీతిని బయటకి తీయాలి, అక్రమార్కులను వదిలి పెట్టకూడదు.
అదే సమయంలో ప్రజలకు జవాబు దారీగా ఉండాలి.అలా కాదు, మేము దోచుకుంటాం. వాళ్ళ అవినీతిలో వాటాలు తీసుకుంటాం అని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలతో పాటూ బీసీ యువజన పార్టీ కూడా నిత్యం ఈ ప్రభుత్వ పనితీరు పరిశీలిస్తూ ఉంటుంది. పాలన గాడి తప్పినా, అవినీతిలో వాటాలు వెతికినా.. ప్రజల తరఫున మా పార్టీ రోడ్డెక్కి వీధి పోరాటాలు చేస్తామని, ఏ మాత్రం ఉపేక్షించబోమని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.