– మరో 26 కంపెనీల ఎస్ఏపీ బలగాలు
– చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అభ్యర్థన
– కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. ఎన్నికల సమయంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్ల కోసం ఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మర్డ్ పోలీసు ఫోర్సెస్) బలగాలు అవసరమవుతాయని కోరారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జనవహర్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో 58 కంపెనీల ఏఎస్‌పీ (స్పెషల్ ఆర్మర్డ్ ఫోర్సెస్) బలగాలు అవసరమవుతాయని కోరారు.
ఎస్ఏపీకి సంబంధించి ప్రస్తుతం 32 బలగాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. మరో 26 కంపెనీల ఎస్ఏపీ బలగాలను పంపాలని అజయ్ భల్లాకు జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, సీఈవోలు, హోం సెక్రటరీలతో అజయ్ భల్లా ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, హోంశాఖ కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా, తదితర అధికారులు పాల్గొన్నారు.