Mahanaadu-Logo-PNG-Large

ఏబీపై సస్పెన్షన్ ఎత్తివేత

-సస్పెండ్ న్యాయవిరుద్ధమన్న క్యాట్
-తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం
-బకాయిలు మొత్తం చెల్లించండి
-క్యాట్ తీర్పుతో వైసీపీ సర్కారుకు షాక్
 ఎన్నికల వేళ జగన్ సర్కారుకు వరస వెంట వరస షాకులు. ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిపై ఈసీ వేటు వేసిన కొద్దిరోజుల వ్యవధిలోనే… జగన్ సర్కారు సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ తాజాగా కొట్టివేసింది. ఏబీవీని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ  కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది.  దానితో ఏబీని తిరిగి విధుల్లోకి తీసుకోవడం అనివార్యంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెంటనే నిర్ణయం తీసుకోవలసి ఉంది. కొత్త డీజీపీ అభిప్రాయం తెలుసుకుని, దానిని ఎన్నికల సంఘానికి నివేదించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఒక ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయని ఏకైక ఐపిఎస్ అధికారిగా.. దేశ చరిత్రలో రికార్డు సృష్టించిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, నాలుగున్నరేళ్ల న్యాయ  పోరాటం ఫలించింది. జగన్ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్‌ను..  హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వివిధ దశలో సవాల్ చేసిన ఏబీవీకి, ఆలస్యంగానయినా న్యాయం జరిగింది. ఆయనపై జగన్ సర్కారు విధించిన సస్పెన్షన్ చెల్లదని క్యాట్ విస్పష్టంగా ప్రకటించింది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్  ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరారవును రెండోసారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్దమని క్యాట్ వ్యాఖ్యానించింది.

తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలంటూ  స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా,  రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.
2019లో వైసీపీ అధికారం చేపట్టడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి జగన్ సర్కార్ తప్పించింది. 9 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చెరవేశారని కేసు నమోదు చేసి విధుల నుంచి తప్పించింది. దాంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు.
తొలిసారి క్యాట్, కేంద్ర హోంశాఖలో కూడా ఊరట కలుగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. బాధ్యతలు చేపట్టే సమయంలో మరోసారి ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది. దానిపై మరోసారి క్యాట్‌ను ఆశ్రయించగా విచారించింది. బుధవారం నాడు ఏబీవీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.ఇదీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కథ