సజ్జల వ్యాఖ్యలపై సీఈవో స్పందన

-కౌంటింగ్‌ సెంటర్‌లో గొడవ చేస్తే జైలుకేనని హెచ్చరిక
-అభ్యర్థి, ఏజెంట్‌లను బయటకు పంపిస్తామని స్పష్టం

అమరావతి: వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఘాటుగా స్పందించారు. గురువారం మచిలీపట్నంలోని ఓ కౌంటింగ్‌ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ రోజు హాలులో ఎవరై నా అల్లర్లు చేయాలని చూస్తే వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని సజ్జల వ్యాఖ్యలపై పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అభ్యర్థి, ఏజెంట్‌లలో ఎవరైనా కౌంటింగ్‌ సెంటర్‌లో గొడవ చేయాలని, అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. కౌంటింగ్‌ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. ఆ రోజు మద్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.