వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్‌బాబు
వేమూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభ ఈ నెల 12న శుక్రవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గౌడపాలెం కాళీకృష్ణ గుడి వద్ద సాయంత్రం 3.00 గంటలకు జరుగుతుందని, నియోజ కవర్గ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్‌బాబు కోరారు. వేమూరులో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ సభలకు బస్సులు పెట్టి జనాలకు డబ్బులు ఇచ్చి తరలించినా జనాలు రాని పరిస్థితి ఉందని, అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు స్వచ్ఛందంగా వస్తున్నారంటే ఆ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..ఓటుతో బుద్ధి చెబుదామని ఎదురుచూస్తున్నా రన్నారు. ఆ పార్టీలో అభ్యర్థులు కరువై ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి టికెట్లు ఇచ్చుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ సమావేశంలో వేమూరు జనసేన సమన్వయకర్త ఊస రాజేష్, కొల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, కొల్లూరు మండల జనసేన అధ్యక్షుడు చలమయ్య తదితరులు పాల్గొన్నారు.