అస్వ‌స్థ‌త‌కు గురైన చిన్నారుల‌ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

విశాఖ: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప‌రామ‌ర్శించారు. గురువారం విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేజీహెచ్ కు వ‌చ్చిన ఆయ‌న చిన్న‌పిల్ల‌ల వార్డును సంద‌ర్శించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లో అస్వ‌స్థ‌త‌కు గురైన చిన్నారుల‌ను ఒక్కొక్క‌రిని ప‌ల‌క‌రించారు.

ఒక్కో బెడ్ వ‌ద్దకు వెళ్లి ప్ర‌తీ చిన్నారితో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మ‌రేం భ‌యం లేద‌ని.. ధైర్యంగా ఉండాల‌ని భ‌రోసా క‌ల్పించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో బాధిత చిన్నారుల త‌ల్లిదండ్రులు, బంధువుల‌తో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి లేద‌ని, పూర్తిగా కోలుకునే వ‌ర‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా నిలుస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

చిన్నారుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌పై వైద్యాధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వ‌ర‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యాధికారుల‌కు సూచించారు. ఆయ‌న వెంట స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా క‌లెక్ట‌ర్, సీపీ త‌దిత‌రులు ఉన్నారు.