తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు, మహానాడు : రాష్ట్ర భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు లోని తెదేపా కార్యాలయంలో పట్టణ ఆర్పీలు, డ్వాక్రా సంఘం లీడర్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు సోమవారం వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…
చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిధులు, పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచిస్తుంటే, ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మాత్రం జైలుకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించడం సిగ్గుమాలిన పని అన్నారు. జగన్ మరల దానిని సమర్థిస్తూ ప్రెస్ మీట్ లో ఈవీఎం పగలకొట్టడం తప్పు కాదని మాట్లాడడం కన్నా దౌర్భాగ్యమైన విషయం మరొకటి ఉండదన్నారు.
నేరాలను ప్రేరేపించే వారికే ఇది నేరంగా కనిపించదన్నారు. తెదేపా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఎవరి పైనా కక్ష సాధింపులకు పాల్పడదని, రాష్ట్ర అభివృద్ధి, బిడ్డల భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యం అని రాజేంద్రప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉయ్యూరు టౌన్ డ్వాక్రా సంఘం ఆర్పీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు కడలి గోపాలరావు, పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులు పిల్లి సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.