Mahanaadu-Logo-PNG-Large

పాలిసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌లో మార్పులు

-కౌంటింగ్‌ దృష్ట్యా సవరణ నోటిఫికేషన్‌ జారీ
-జూన్‌ 7 నుంచి 10 వరకు ఐచ్చికాల నమోదుకు అవకాశం
-జూన్‌ 13న సీట్ల కేటాయింపు..14 నుంచి తరగతులు
-సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి

అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌, జూన్‌ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తం గా మూడురోజుల పాటు 144 సెక్షన్‌ విధింపు కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పాలిసెట్‌ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, సాంకేతిక విద్య శిక్షణ మండలి చైర్మన్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో విభిన్న అంశాలను చర్చించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అనంతరం అందుకు సంబంధించిన సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవేశాలకు సంబంధించిన ఫీజు చెల్లింపు, ధృవపత్రాల వెరిఫికేషన్‌ తదితర ఆన్‌లైన్‌ ప్రక్రియ తేదీలలో ఎటువంటి మార్పు లేదని, జూన్‌ 2 వరకు అవకాశం ఉంటుందన్నారు. 3వ తేదీన ఉన్న ధృవపత్రాల వెరిఫికేషన్‌ను 6వ తేదీన నిర్వహిస్తామని, ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సైతం ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు. జూన్‌ 7 నుంచి 10 వరకు కళాశాలల ఎంపిక నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. జూన్‌ 11వ తేదీన ఐచ్చికాల మార్పుకు అవకాశం ఉంటుందన్నా రు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని వివరించారు. జూన్‌ 14 నుంచి 19వ తేదీ వరకు 6 రోజుల లోపు ప్రవేశాలు ఖరారైన విద్యార్థులు అయా పాలి టెక్నిక్‌లలో వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌ విధానంలోనూ రిపోర్టు చేయాల్సి ఉంటుంద న్నారు. జూన్‌ 14వ తేదీ నుండే రాష్ట్రవ్యాప్తంగా తరగతులు ప్రారంభం అవుతా యని పేర్కొన్నారు. ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వెలగా పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, చీఫ్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ విజయకుమార్‌, ఉపసంచాలకులు విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.