విద్యుత్ ఉద్యోగుల దాతృత్వం

– ఒక రోజు వేతనం రూ. 10,61,81,614 విరాళం
– మంత్రి గొట్టిపాటి వెల్లడి

విజయవాడ, మహానాడు: నగరంలో పది రోజులుగా వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ బాధితులకు అండగా ఉంటూ పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈమేరకు ఆయన ఎన్టీఆర్ కలెక్టరేట్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా ముఖ్యమంత్రి ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తూనే తమ సేవలు అందిస్తున్నారు. 3-4 లక్షల విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరించారు. అంతేకాకుండా విద్యుత్ ఉద్యోగులు ఒకరోజు జీతం 10 కోట్ల 61 లక్షల 18 వేల 694 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు… ఇది శుభపరిణామం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి అందిస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఏపీ విద్యుత్ జేఏసీ చైర్మన్ సాన కృష్ణయ్య మాట్లాడుతూ… విద్యుత్ ఉద్యోగులకు మొదటి నుంచి ముఖ్యమంత్రి ఎంతో సహకరిస్తున్నారు. విభజన సమయంలో కూడా విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సహకారం మరువలేనిది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు అండగా నిలబడాలని ఆయన కోరారు.