– త్వరితగతిన సేవలకు ప్రత్యేక సిబ్బంది, వాహనాలు
– విద్యుత్ అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మహానాడు: దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్(సీబీడీ) విభాగాన్ని పటిష్ఠపరిచేందుకు అన్ని డివిజన్ లలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణ కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను ఆయన సోమవారం ప్రారంభించిన అనంతరం మీడియాతో ఏమన్నారంటే… ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లు ఉన్నాయి ప్రతి డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నాం. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నాం. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతారు.
ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు. ప్రతి వాహనంలో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపం మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ అవసరమైన అన్ని భద్రతా పరికరాలు.. సాధనాలతో ఈ వాహనం సిద్ధంగా ఉంటుంది. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయి. వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను లాగ గలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా సిబ్బంది వాటిని తక్కువ సమయంలో తరలించడానికి, మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది.
TGAIMS యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. సిబ్బంది అవసరమైన ప్రదేశానికి వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాహనాలను విద్యుత్ అంబులెన్సులు అని పిలవచ్చు. ఇవి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీలను అత్యవసరంగా సరిదిద్దడానికి సహాయపడతాయి. తద్వారా వినియోగదారులకు వేగంగా, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ వాహనాలు దిగ్విజయంగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కార్యక్రమంలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీ లు ముషారఫ్ అలీ, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.