Mahanaadu-Logo-PNG-Large

సినిమా ‘శివుడు’

తెలుగు సినీ చరిత్రలో ఆ మహాశివుడి పాత్రను వేయడానికి ఎంతోమంది నటులు పోటీపడేవాళ్లు. వైవిధ్యమైన కథలతో దర్శకులు సైతం నీలకంఠున్ని తెరమీద చూపించాలనే లక్ష్యంతో సినిమాలను తీసేవాళ్లు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అత్యధిక పౌరాణిక చిత్రాలను నిర్మించిన ఘనత ఖచ్చితంగా తెలుగు వారిదే. కాలగమనంలో పౌరాణిక చిత్రాలు నాటకాల ప్రభావం నుండి బయట పడి అస్థిత్వాన్ని ఏర్పరచుకున్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి కథలతో పాటు పరమశివుడు ప్రధాన పాత్రధారిగా, సత్రధారిగా తెలుగులో కొన్ని పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఇవన్నీ మనకు ప్రత్యేకమైనవి. నేడు మహిళా దినోత్సవంతో పాటు శివరాత్రి కావడంతో సినిమాల్లో వెండితెర పై శివుడి పైన వచ్చిన చిత్రాలను మరోసారి గుర్తుచేసుకుందాం…

సినిమాల్లో శివుడి పాత్ర తొలిసారిగా కనిపించింది ‘సతీ అనసూయ’ (1935)చిత్రంలో అని చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ… దాసరి కోటిరత్నం నిర్మాతగా మారి తీసిన చిత్రం ఇది. అరోరా ఫిల్మ్‌ కార్పొరేషన్‌తో ఆమె ఈ సినిమా తీశారు. అహిన్‌ చౌదరి దర్శకుడు. సినిమాలో టైటిల్‌ రోల్‌ ఆమే పోషించారు. ఈ చిత్రంలో శివుడి పాత్ర పోషించిన నటుడి వివరాలు లభ్యం కాలేదు. ‘సతీ అనసూయ’ పేరుతోనే మరో రెండు చిత్రాలు వచ్చాయి. 1957లో విడుదలైన ‘సతీ అనసూయ’లో అంజలీదేవి అనసూయగా నటించారు. ఇందులో అమరనాథ్‌ ఈశ్వరుడిగా చేశారు. 1971లో మరోసారి వచ్చిన ‘సతీ అనసూయ’లో జమున టైటిల్‌ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాకరరెడ్డి శివుడి పాత్రతో భక్తిని వెదజల్లారు. పరమశివుడు కథానాయకుడిగా కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో తొలి సినిమా ‘పార్వతీకల్యాణం’. ప్రతిభా సంస్థను నెలకొల్పి ఘంటసాల బలరామయ్య నిర్మించిన తొలి చిత్రం ఇది. 1941లో వచ్చిన ‘పార్వతీకల్యాణం’లో బలరామయ్య అన్నయ్య రాధాకృష్ణయ్య శివుడిగా, తమ్ముడు శేషాచలం నారదుడిగా నటించారు. శాంతకుమారి పార్వతిగా నటించారు. మద్రాసులోని వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోలో ఈ చిత్రనిర్మాణం జరిగింది. 1962లో ‘పార్వతీకల్యాణం’ పేరుతో మరో చిత్రం వచ్చింది. ఇందులో బాలయ్య శివుడిగా నటించారు.

పరమేశ్వరుని శక్తిసామర్ధ్యాలను, భార్య పట్ల ఆయనకున్న అభిమానాన్ని నిరూపించే చిత్రాలు ఒకే టైటిల్‌తో రెండుసార్లు వచ్చాయి. 1941లో తొలిసారిగా వచ్చిన ‘దక్షయజ్ఞం’ చిత్రంలో శివుడిగా సదాశివరావు, దాక్షాయణిగా కృష్ణవేణి నటించారు. 1962లో ‘దక్షయజ్ఞం’ పేరుతోనే మరో చిత్రం వచ్చింది. అప్పటికే అనేక పౌరాణిక పాత్రలు పోషించిన ఎన్టీఆర్‌ తొలిసారిగా శివుడి పాత్ర ధరించారు.కెవి రెడ్డి రూపొందించిన ‘ఉమాచండీగౌరీ శంకరుల కథ’ చిత్రంలో మాత్రం కేవీ అభ్యర్థన మేరకు మరోసారి శివుడి పాత్ర పోషించారు ఎన్టీఆర్‌. ఒకప్పటి స్టార్‌ హీరో చదలవాడ నారాయణరావు శివుడి పాత్ర పోషించిన చిత్రం ‘గంగా గౌరీ సంవాదం’.ఎన్టీఆర్‌, జూనియర్‌ శ్రీరంజని జంటగా నటింన ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ (1956) చిత్రంలో కాంతారావు తొలిసారిగా శివుడి పాత్ర పోషించారు. భక్త మార్కండేయ’ (1956), ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1958) చిత్రాల్లో శివుడి పాత్రలు పోషించారు కాంతారావు. తెలుగు సినీ ప్రయాణంలో శివయ్యకు తిరుగులేదు. ఆయన పాత్రను ప్రతితరం పోషిస్తూనే ఉంది. నాలుగు దశాబ్దాల తన నట జీవితంలో మూడుసార్లు శివుడి పాత్ర పోషించే అవకాశం చిరంజీవికి లభించింది. 1981లో వచ్చిన ‘పార్వతీ పరమేశ్వరులు’ చిత్రంలో తొలిసారిగా ఆయన శివుడి గెటప్‌లో కనిపించారు. హీరోయిన్‌ ప్రభతో కలిసి పాట పాడే సన్నివేశంలో ఆయనలా కనిపించారు. అలాగే కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో కూడా ఒక నృత్య సన్నివేశంలో ఆయన శివుడిగా నటించారు. చిరంజీవి పూర్తి స్థాయిలో శివుడి పాత్ర పోషించిన చిత్రం ‘శ్రీమంజునాథ’. సాంఘిక చిత్రాల్లో యముడు, చిత్రగుప్తుడు కనిపించడం సాధారణమే! అయితే మహాశివుడు భూలోకానికి వచ్చి తన భక్తుడిని పరీక్షించడం, దుష్టులకు బుద్ధి చెప్పడం వంటి ఆసక్తికరమైన ఇతివృత్తంతో 1979లో ‘మా ఊళ్లో మహాశివుడు’ చిత్రం వచ్చింది. విలన్‌ పాత్రలను పోషించడంలో తమకు సాటి లేరనిపించుకున్న రావు గోపాలరావు ఇందులో శివుడిగా, సత్యనారాయణ ఆయన భక్తుడిగా నటించారు అందాల నటుడు శోభన్‌బాబు రెండు చిత్రాల్లో శివుడి పాత్రలు పోషించారు. ‘సోమవార వ్రత మహాత్మ్యం’ చిత్రంలో తొలిసారిగా శివుడిగా కనిపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’ చిత్రంలో కూడా శివుడిగా గెస్ట్‌ వేషం వేశారు శోభన్‌బాబు.

విలన్‌ పాత్రలతో ప్రేక్షకుల్ని భయపెట్టిన నటులు కూడా శివుడి పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం విశేషం. విలనీతో కామెడీని కలగలిపి నటించే నాగభూషణం ‘నాగులచవితి’, ‘భూకైలాస్‌’ తదితర చిత్రాల్లో శివుడిగా నటించారు. కైకాల సత్యనారాయణ కూడా రెండు చిత్రాల్లో శివుడి పాత్ర పోషించారు. 1962లో విడుదలైన ‘స్వర్ణగౌరీ’, ‘భీష్మ’ చిత్రాల్లో ఆయన శివుడిగా నటించగా, మరో ప్రముఖ విలన్‌ రాజనాల ‘ఉషా పరిణయం’ చిత్రంలో ముక్కంటిగా నటించారు. మరో విలన్‌ త్యాగరాజు ‘బాలనాగమ్మ’లో శివుడిగా వేశారు కానీ ఆ సినిమా విడుదల కాలేదు.

కృష్ణం రాజు కూడా ‘శ్రీ వినాయక విజయము’లో శివుడి పాత్రను ధరించారు మరియు ప్రముఖ శివ భక్తుడు కన్నప్ప తన సొగసైన రూపాలతో కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘బెదర కన్నప్ప’ యొక్క తెలుగు రీమేక్. భక్త కన్నప్ప చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు మరియు ప్రభాస్ తండ్రి యు.సూర్యనారాయణ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి వి.ఎస్.ఆర్ సినిమాటోగ్రఫీ అందించారు.

‘శ్రీ సత్యనారాయణ మహత్యం’లో సుమన్, ‘డమరుకం’లో ప్రకాష్ రాజ్, ‘మగరాయుడు’లో మల్లికార్జునరావు, ‘ఉషాపరిణయం’లో రాజనాల, ‘మావూరులో మహాశివుడు’లో రావుగోపాలరావు, నాగభూషణం వంటి పలువురు నటీనటులు శివగా నటించారు. భూకైలాస్’, ‘నాగుల చవితి’, తమిళ నటుడు కమల్ హాసన్ ‘లో, విజయ్ కాంత్ ‘మధుర మీనాక్షి’లో ఇంకా ఎన్నో. త్రిమూర్తుల్లో ఒకరైన భోళా శంకరుని మహత్యాలకు ఆది అంతం లేదు. శివుడి పాత్రతో ఎన్ని తెలుగు సినిమాలు వచ్చినా ఆ గరళకంఠుని రూపం ఎప్పుడూ కొత్తగా ఆసక్తిగా అద్భుతంగా కనిపిస్తూనే ఉంటుంది. శివతత్వం విశ్వమంత విశాలమైనది.. అదెప్పటికీ ‘తెర’ మరుగవ్వదు.