– సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధుకు ప్రముఖుల అభినందన
గుంటూరు, మహానాడు: సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి చేస్తున్న సమాజ సేవను గుర్తించిన పౌర సంస్థలు సోమవారం స్థానిక జీఎస్టీ కమిషనర్ హాల్లో ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు పి. రామచంద్రరాజు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు, నేస్తం వ్యవస్థాపకుడు జలీల్ అహ్మద్, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తో కూడిన పౌర సంస్థల బృందం సాధు నరసింహారెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ ఈ నెల తొమ్మిదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రదేశాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించి 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించటం అభినందనీయమన్నారు. సాధు నరసింహారెడ్డి చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ జీఎస్టీ బృందం 4100 రక్తదాతల నుండి స్వచ్ఛందంగా రక్తం సేకరించి తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత రాకుండా కృషి చేయడం హర్షిణియమన్నారు.
నరసింహారెడ్డిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులు విద్య,వైద్య రంగాలలో కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు పి. రామచంద్రరాజు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో రక్తం కొరతను తీర్చే మహా యజ్ఞంలో సాధు నరసింహారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ప్రసంగిస్తూ సమాజ సేవలో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు.పేద విద్యార్థులకు సహాయం చేయటం ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రోత్సహించటం ఆనందం కలిగిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, దేశముఖ్ జీఎస్టీ అధికారులు సిహెచ్ ఈశ్వర్, జి.శ్రీనివాసరెడ్డి, తదితరులు ప్రసంగించారు.