ప్రక్షాళన అత్యవసరం!

తిరుమల కొండపై ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థుల సమస్యలపై 1977 – 78 కాలంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుడిగా నేను ఒక సమావేశం నిర్వహించడానికి వెళ్ళా. తిరుమలపై సమావేశాలు నిర్వహించకూడదని ఉపాధ్యాయులు చెప్పారు. మారు మాట మాట్లాడకుండా, దేవస్థానం అమలు చేస్తున్న నిబంధనలను మనస్ఫూర్తిగా గౌరవించి వెనుదిరిగి వచ్చేశాను.

గత కొంత కాలంగా చూస్తున్నాం, చట్టసభల సభ్యులు, మంత్రులు హంగూ ఆర్భాటంతో దేవుడ్ని దర్శనం చేసుకొని బయటకు రాగానే, తిరుమల కొండపైనే ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో నోటికొచ్చినట్లు కుసంస్కారంగా సంకుచిత రాజకీయ వ్యాఖ్యలు, కువిమర్శలు చేయడం పరిపాటిగా మారింది కదా!

“భగవంతుడు సర్వాంతర్యామి” అని భక్తుల విశ్వాసం కదా! అవినీతి రాజకీయ నాయకులు – పాలకులు అవినీతిని “సర్వాంతర్యామి”గా విస్తరించేశారు కదా!

అవినీతిపరులకు దేవుడంటే భయం ఏ మాత్రం లేదనుకుంటా! ఎందుకంటే! కానుకల రూపంలో అవినీతి – అక్రమార్జన – దోపిడీ సొమ్ములో కొంత వాటాను దేవుడి హుండీలో వేస్తున్నారు కాబట్టి! కొన్నేళ్ళ క్రితం గనుల మాఫీయా లీడర్ గాలి జనార్ధన్ రెడ్డి, అత్యంత ఖరీదైన నగలు దేవుడికి సమర్పించుకున్నారని ప్రసారమాధ్యమాల్లో వార్త చూసినట్లు గుర్తు!

కల్తీ – అనైతిక – అవినీతి – అక్రమార్జనపరుల నుండి “తిరుమల లడ్డు” పవిత్రతతో పాటు ప్రజలను కూడా రక్షించండి! రైతులకు కావలసిన విత్తనాలు – పురుగు మందులు – రసాయనిక ఎరువులు – పశువుల దాణా అన్నింటిలోనూ కల్తీనే కదా! పర్యవసానంగా తల్లి పాలు – కొబ్బరి నీళ్ళుతో పాటు అన్నీ కల్తీ అయిపోయాయన్న ఆవేదనతో సమాజం సతమతమౌతున్నది కదా!

నేటి అవినీతి సమాజంలో దేవాలయాల్లో ప్రసాదం మొదలుకొని.. ఆధునిక దేవుళ్లైన వైద్యులు సూచించే ఔషధాల వరకు కల్తీ – నాసిరకమే కదా! ఇహ! ఆవు – గేదె పాలు – నెయ్యి కల్తీ చేయకుండా అక్రమార్జనపరులు, పాపభీతితో ఉంటారా!

ప్రభుత్వ పెద్దలు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామంటున్నారు కదా! ప్రజలకు నాణ్యమైన దేవుని ప్రసాదంతో పాటు, నాణ్యమైన ఆహారం – ఆరోగ్యం – విద్యనందించండం – ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగా గుర్తించాలి!

విద్య – వైద్య రంగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన – చేస్తున్న కృషి వల్ల సమాజానికి ఎంతో మేలు వనగుడుతున్నది కదా! చరిత్ర పుటలు తిరగేస్తే రెండవ కృష్ణదేవరాయలు కాలంలో దేవస్థానాలు రైతులకు, సాగునీటి సరఫరా కోసం చెరువులు నిర్మించి – నిర్వహణ – మరమ్మతులు చేసేవట. తిరుమల దేవస్థానం కూడా తిరుపతి ప్రాంతంలో చెరువును నిర్మించిందని చరిత్రకారుల మాట.

కరవు పీడిత ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కొంత భాగం వెచ్చిస్తే, “మానవ సేవే మాధవ సేవ” అన్న సూక్తికి పరమార్థం ఉంటుందేమో!

– టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక