బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా

మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

బాచుపల్లి, మహానాడు : బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుండపోత వర్షంతో ఒక్కసారిగా గోడ కూలిందని, భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్‌ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయని వివరించారు. చనిపోయిన వారు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామని, మృతుల్లో నాలుగేళ్ల బాబు, ఒక మహిళ, నలుగురు పురుషులు ఉన్నట్లు వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యచికిత్స అందించాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.